Telugu Global
NEWS

ఉపాధ్యాయులు వర్సెస్ ఉద్యోగ సంఘాలు..

ఏపీలో పీఆర్సీ వ్యవహారం నిన్నటి వరకు ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. తీరా పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చర్చలు జరిపి సమ్మె విరమించుకున్న తర్వాత పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులు అన్నట్టుగా మారింది. పీఆర్సీ సాధన సమితి నుంచి బయటకి వచ్చేసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు వేరుకుంపటి పెట్టుకున్నారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలపై సోషల్ మీడియాలో దుర్భాషలు మొదలయ్యాయి. […]

ఉపాధ్యాయులు వర్సెస్ ఉద్యోగ సంఘాలు..
X

ఏపీలో పీఆర్సీ వ్యవహారం నిన్నటి వరకు ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. తీరా పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో చర్చలు జరిపి సమ్మె విరమించుకున్న తర్వాత పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులు అన్నట్టుగా మారింది. పీఆర్సీ సాధన సమితి నుంచి బయటకి వచ్చేసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు వేరుకుంపటి పెట్టుకున్నారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలపై సోషల్ మీడియాలో దుర్భాషలు మొదలయ్యాయి. దీంతో వారంతా తమకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. తమని చంపేసే ప్రమాదం ఉందంటూ.. బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు.. ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఆవేదన వెలిబుచ్చారు. ఫిట్మెంట్ విషయం నచ్చకపోతే ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. సమ్మెలోకి వెళ్లకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని అన్నారు.

దుష్ప్రచారంపై సీఎస్ కి ఫిర్యాదు..
తమపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ నలుగురు మండిపడ్డారు. సోషల్ మీడియాలో తమ ఫొటోలకు దండలు వేసిన ఫొటోలు పెడుతున్నారని, తమకు కర్మకాండలు చేస్తున్నట్టు మెసేజ్ లు పంపుకుంటున్నారని అన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కి వారు ఫిర్యాదు చేశారు. ఉన్నంతలో మంచి ఫలితం రాబట్టామని, తమను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. మరోవైపు విజయవాడలోని ఎన్జీవో హోమ్, రెవెన్యూ భవన్, ఇతర ఉద్యోగ సంఘాల కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. కొన్ని చోట్ల పీఆర్సీ సాధన సమితి నేతల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మా పోరాటం ప్రభుత్వంపైనే..
ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమ పోరాటం ప్రభుత్వంపైనే అని స్పష్టం చేశాయి. పీఆర్సీ సాధన సమితి నేతలతో ప్రభుత్వమే ప్రెస్ మీట్లు పెట్టిస్తోందని, తమపై కక్షసాధింపులకు పాల్పడే అవకాశముందని అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. 30శాతం ఫిట్ మెంట్ ఉంటుందని ఆశిస్తే నిరాశే ఎదురైందని, పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కనీసం చర్చల్లో ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటకు రానీయడంలేదని, మంత్రులు చెప్పినట్టే, వారు చీటీల్లో రాసిచ్చినట్టే సాధన సమితి నేతలు మాట్లాడారని, తమకి అన్యాయం చేశారని మండిపడ్డారు. మెరుగైన పీఆర్సీకోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

First Published:  9 Feb 2022 10:19 PM GMT
Next Story