Telugu Global
NEWS

కేంద్రానిది దొడ్డిదారి దోపిడీ..

పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంలో కేంద్రం.. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పేరు మార్చి.. సెస్సులు, సర్ చార్జీలు అని వసూలు చేస్తే మాత్రం మొత్తానికి మొత్తం కేంద్రం తమ జేబులో వేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రూల్స్ అడ్డు రావు. సరిగ్గా ఇదే ప్లాన్ తో రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం దారి మళ్లిస్తోంది. సెస్సులు, సర్ చార్జీల పేరుతో రాష్ట్రాల వాటాను కేంద్రం దోచుకుంటోంది. ఇలా దోచుకోవడం సరికాదని, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర […]

కేంద్రానిది దొడ్డిదారి దోపిడీ..
X

పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంలో కేంద్రం.. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పేరు మార్చి.. సెస్సులు, సర్ చార్జీలు అని వసూలు చేస్తే మాత్రం మొత్తానికి మొత్తం కేంద్రం తమ జేబులో వేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రూల్స్ అడ్డు రావు. సరిగ్గా ఇదే ప్లాన్ తో రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం దారి మళ్లిస్తోంది. సెస్సులు, సర్ చార్జీల పేరుతో రాష్ట్రాల వాటాను కేంద్రం దోచుకుంటోంది. ఇలా దోచుకోవడం సరికాదని, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన కేంద్రం పన్నుల తీరుని సునిశితంగా విమర్శించారు. సెస్ ల పేరుతో జరుగుతున్న దోపిడీని బయటపెట్టారు. కేంద్ర బడ్జెట్.. సబ్‌కా సాథ్‌ కాదు సబ్‌కా హాత్‌ అని దుయ్యబట్టారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో ఆర్భాటం తప్ప విషయం లేదని విమర్శించారు విజయసాయిరెడ్డి. ఆపరేషన్‌ సక్సెస్‌… పేషెంట్‌ డెడ్‌ అన్నట్లు బడ్జెట్ ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి మాట్లాడుతోందని, కానీ బడ్జెట్ చూస్తే, రాష్ట్రాల ఆత్మ నిర్భరత ఏమైందనే ప్రశ్న వినిపిస్తుందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం తన హస్త లాఘవం ప్రయోగించి దారుణంగా తగ్గించిందని అన్నారు. బడ్జెట్‌ అంకెల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూల పన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్‌చార్జీలను పెంచుకుంటూ పోయిందని చెప్పారు. సెస్సులు, సర్‌ చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే కేంద్రం దొడ్డిదారిలో దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. వాస్తవానికి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో డివిజబుల్‌ పూల్‌ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సెస్సులు, సర్‌చార్జీలు డివిజబుల్‌ పూల్‌ కిందకు రావు. అందుకే రాష్ట్రాల వాటా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతానికి బదులు 29 శాతానికి పడిపోయిందని వివరించారు విజయసాయి రెడ్డి.

పెట్రోల్‌, డీజిల్‌ సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత..?
పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం 3.35లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఆర్జించిందని, ఈ మొత్తం ఆదాయంలో అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది కేవలం 5.8 శాతం మాత్రమేనని, ఆ మొత్తం విలువ కేవలం 19,475 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు విజయసాయిరెడ్డి. పెట్రోల్‌, డీజిల్‌ పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరో 2 లక్షల 87 వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వలేదని అన్నారు. కేంద్రం చర్యలతో ఎక్సైజ్‌ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్‌పై 40 శాతం, డీజిల్‌పై 59 శాతం తగ్గిపోయిందని చెప్పారు. లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయలు అనుకుంటే, అందులో 31.5 రూపాయలు కేంద్రానికి వెళ్తోందని, బేసిక్‌ ఎక్స్‌జై డ్యూటీ కింద వసూలు చేసే 1 రూపాయి 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అవుతోందని గణాంకాలతో సహా వివరించారు విజయసాయిరెడ్డి.

డివిజబుల్‌ పూల్‌ లో తగ్గిపోతున్న ఏపీ వాటా..
డివిజబుల్‌ పూల్‌ లో రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా.. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన ఉంటుందని.. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అధిక వాటాను పొందుతుంటే, జనాభా నియంత్రణ కోసం పని చేసే రాష్ట్రాలకు తక్కువ వాటా ఇచ్చి వాటిని శిక్షిస్తున్నారని విమర్శించారు విజయసాయిరెడ్డి. ఇలా ఏపీకి వచ్చే పన్నుల వాటా 6.9 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయిందని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో తేడా చూడండి..
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్‌ లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022-23 బడ్జెట్‌ లో కేంద్రం 3.8 శాతం వాటా కేటాయించిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. విద్యా రంగానికి ఏపీ 11.8 శాతం నిధులను కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌ లో అది కేవలం 2.6 శాతం మాత్రమే ఉందని అన్నారు. ఆరోగ్య రంగానికి ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు 6 శాతం ఉండగా, కేంద్ర బడ్జెట్‌ లో కేవలం 2.2 శాతం మాత్రమే కేటాయించారని అన్నారు. కేంద్రం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నా.. అన్ని రంగాలకు కేంద్రం కంటే మిన్నగా ఏపీ కేటాయింపులు చేస్తోందని చెప్పారు విజయసాయిరెడ్డి.

కేంద్ర పన్నుల ఆదాయంలో 10 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ బడ్జెట్‌ లో మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదని విమర్శించారు విజయసాయిరెడ్డి. ఆదాయ పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు చేయలేదని గుర్తు చేశారు. ద్రవ్యోల్బనం పెరిగి, ధరల్లో వ్యత్యాసం భారీగా పెరిగిందని, అయినా ట్యాక్స్ శ్లాబ్ లు సవరించకపోవడం దారుణం అని అన్నారు. ప్రస్తుతం ఐటీ రిటర్న్‌ లు ఫైల్‌ చేయాలంటే పన్ను చెల్లించేవారు 5 రకాల డాక్యుమెంట్లు సమకూర్చుకోవాల్సి వస్తోందని, దీన్ని సులభతరం చేయాలని కోరారు. ఇన్‌ కం టాక్స్‌ పోర్టల్‌ లో లోపాలు, అవాంతరాలు సరిదిద్దాలన్నారు.

సబ్సిడీలకు కోతలెందుకు..?
కరోనా మహమ్మారి కాలంలో ఎవరినీ పస్తులుంచబోమని చెప్పే కేంద్రం, బడ్జెట్‌ లో ఆహార సబ్సిడీని 28 శాతానికి తగ్గించడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. ఎరువుల సబ్సిడీని 25 శాతానికి తగ్గించారని, వంట గ్యాస్ సబ్సిడీని 11 శాతానికి పరిమితం చేశారని విమర్శించారు.

విభజన హామీల సంగతేంటి..?
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం కింద ఇచ్చిన ప్రధాన హామీలైన వైజాగ్‌ రైల్వే జోన్‌, వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, పోలవరం ప్రాజెక్ట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌.. ఇంకా హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు విజయసాయి రెడ్డి. విభజన చట్టంలో పొందుపరచిన విద్యాసంస్థలకు కూడా కేటాయింపులు లేవని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల మాత్రం నోరు మెదపడంలేదని విమర్శించారు.

అనంతపురం సెంట్రల్‌ వర్సిటీకి 31 కోట్లు
అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కు 31.24 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక జవాబిచ్చారు. సెంట్రల్‌ యూనివర్శిటీ క్యాంపస్‌ నిర్మాణంపై సమర్పించిన డీపీఆర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
ఈ ఏడాది జూన్‌ నాటికి ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి మధ్య నిర్మిస్తున్న 6 లైన్ల జాతీయ రహదారి పూర్తవుతుందని జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. 2527 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 50 కిలోమీటర్ల మేర చేపట్టిన 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం 2021 జులై నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా ఆలస్యమైందని.. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని అయితే దీని వలన ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశం లేదని తెలిపారు.

First Published:  9 Feb 2022 7:59 AM GMT
Next Story