Telugu Global
National

సీఎం అభ్యర్థి ప్రకటనతో పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు..

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ పేరుని ఖరారు చేసిన తర్వాత రెండురోజుల పాటు అంతా ప్రశాంత వాతావరణమే కనిపించింది. సిద్ధూ లోలోపల మథనపడుతున్నా.. పైకి మాత్రం హుందాగా వ్యవహరించారు. అయితే సిద్ధూభార్య, నవజ్యోత్ కౌర్ మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన్ను ఎవరో తప్పుదోవపట్టించారని వ్యాఖ్యానించారు. పేదవాడైన చన్నీ.. పేదల కష్టాలు తీరుస్తారని, పంజాబ్ ప్రజలు కూడా అదే […]

సీఎం అభ్యర్థి ప్రకటనతో పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు..
X

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ పేరుని ఖరారు చేసిన తర్వాత రెండురోజుల పాటు అంతా ప్రశాంత వాతావరణమే కనిపించింది. సిద్ధూ లోలోపల మథనపడుతున్నా.. పైకి మాత్రం హుందాగా వ్యవహరించారు. అయితే సిద్ధూభార్య, నవజ్యోత్ కౌర్ మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన్ను ఎవరో తప్పుదోవపట్టించారని వ్యాఖ్యానించారు. పేదవాడైన చన్నీ.. పేదల కష్టాలు తీరుస్తారని, పంజాబ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సిద్ధూ భార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయడానికి కేవలం పేదరికమే ప్రామాణికం కాదని, విద్య, సమర్థత, నిజాయితీ ని పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. సిద్ధూ సీఎం అయితే 6 నెలల్లోనే పంజాబ్ రూపు రేఖలు మార్చేసే వారని అన్నారు. తమకంటే చన్నీయే ధనవంతుడని, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ తమకంటే చాలా ఎక్కువని పరోక్షంగా విమర్శలు గుప్పించారు నవజ్యోత్ కౌర్.

సిద్ధూ వర్గంలో తీవ్ర అసంతృప్తి..
అమరీందర్ సింగ్ కి పొగపెట్టి బయటకు పంపించిన తర్వాత కచ్చితంగా సీఎం కుర్చీ తనదేనని ఆశించారు సిద్ధూ. కానీ ఆయన ఆశలకు గండికొట్టిన అధిష్టానం చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశమిచ్చి దళిత సీఎం అనే కొత్త వ్యూహం రచించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయినా తనకే ప్రాధాన్యత దక్కుతుందని అనుకున్నారు సిద్ధూ. ఎన్నికల ప్రచారంలో కూడా అన్నీ తానై చూసుకున్నారు. సీఎం అభ్యర్థిని తానేనంటూ సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. తీరా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ వర్గానికి షాకిచ్చింది. చన్నీ పేరుని సీఎం అభ్యర్థిగా ఖరారు చేసి సిద్ధూకి చెక్ పెట్టింది.

కాంగ్రెస్ కి లాభమా..? నష్టమా..?
పంజాబ్ లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీతో కచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి గండిపడే అవకాశముంది. అదే సమయంలో మనీష్ తివారీ వంటి సీనియర్లను సైతం పక్కనపెట్టి రాహుల్ గాంధీ.. కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వాస్తవానికి చన్నీ కంటే సిద్ధూకే పంజాబ్ కాంగ్రెస్ పై పట్టు ఉంది. కానీ రాహుల్ గాంధీ.. మరోసారి దళిత సీఎం అనే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ప్రీపోల్ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా పంజాబ్ కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుని మాత్రమే నమ్ముకుంది. ఈ దశలో సీఎం అభ్యర్థి ఖరారు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు నాంది పలికింది. ఎన్నికలయ్యే వరకు అధిష్టానం సైలెంట్ గా ఉంటే బాగుండేదని ఓ వర్గం నాయకుల అభిప్రాయం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహించి.. సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా ఓ అడుగు ముందుకేసింది. అయితే చన్నీ పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ కి పెద్దగా ఉపయోగం లేకపోగా.. సిద్ధూ వర్గంలో నిరాశ నింపిందనే ప్రచారం జోరందుకుంది. చీటికి మాటికి అలక బూనే సిద్ధూ.. ఈసారి సైలెంట్ గా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి సిద్ధూ భార్య తన అసంతృప్తి బయటపెట్టారు. తీరా ఎన్నికల సమయానికి సిద్ధూ అధిష్టానానికి షాకిస్తారేమో చూడాలి.

First Published:  8 Feb 2022 11:14 PM GMT
Next Story