సీఎం వర్సెస్ గవర్నర్.. ముదురుతున్న వివాదం..
పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్ కర్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతేడాది సీఎంగా మమత ప్రమాణ స్వీకారం సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతూ పరోక్షంగా మమతకు చురకలంటించారు గవర్నర్. అదే వేదికపై మమత కూడా ధీటుగా బదులిచ్చారు. ఈసీ అధీనంలో శాంతి భద్రతల నిర్వహణ అదుపు తప్పిందని దాన్ని గాడిలో పెడతానన్నారు. అలా ప్రమాణ స్వీకారం రోజున […]
పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్ కర్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతేడాది సీఎంగా మమత ప్రమాణ స్వీకారం సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతూ పరోక్షంగా మమతకు చురకలంటించారు గవర్నర్. అదే వేదికపై మమత కూడా ధీటుగా బదులిచ్చారు. ఈసీ అధీనంలో శాంతి భద్రతల నిర్వహణ అదుపు తప్పిందని దాన్ని గాడిలో పెడతానన్నారు. అలా ప్రమాణ స్వీకారం రోజున మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానలా మారి ఇప్పుడు ట్విట్టర్ వార్ గా మారింది.
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటన సందర్భంలో కూడా సీఎం, గవర్నర్ ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్ ట్విట్టర్ ఖాతాను, సీఎం మమత.. బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఈ చర్యను ప్రజాస్వామ్యానికే సవాల్ గా పేర్కొన్నారు గవర్నర్. ఈ వ్యవహారంలో సీఎం మమతను మీడియా ప్రశ్నించకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రతిరోజూ తాను ట్వీట్లు చేస్తున్నానంటూ సీఎం ఆరోపించారని, కానీ అది అవాస్తవం అని, తాను ఒక్క ట్వీట్ కూడా చేయలేదని పేర్కొన్నారు గవర్నర్ జగదీప్.
ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో లేదు..
పాలన విషయంలో గవర్నర్ జోక్యం ఎక్కువైందంటూ మమతా బెనర్జీ చేసిన విమర్శలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. తన టేబుల్ పై ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో లేదని వివరణ ఇచ్చారు. పెండింగ్ సమస్యలు ఉంటే, సీఎం, ప్రభుత్వమే వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తన భోజనం విషయంలో కూడా సీఎం మమత విమర్శలు చేయడం సరికాదన్నారు గవర్నర్. తాను ప్రతిరోజూ తాజ్ బెంగాల్ నుంచి భోజనం తెప్పించుకుంటున్నానంటూ సీఎం చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. అది వందశాతం అవాస్తవం అన్నారు. తాను అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు ఒక్క ట్వీట్ గానీ లేదా పేపర్ పై ఒక్క ఆదేశం కానీ చూపించాలని సవాల్ విసిరారు. బెంగాల్ లో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా సాగడంలేదని, అందుకే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తోందన్నారు.