Telugu Global
NEWS

తెలంగాణలో రాజుకున్న 'రాజ్యాంగ' వివాదం..

కేంద్ర బడ్జెట్ పై విమర్శలు చేసే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యాంగాన్ని మార్చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, అంబేద్కర్ ని అవమానించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణం అయ్యాయి. అసలు […]

తెలంగాణలో రాజుకున్న రాజ్యాంగ వివాదం..
X

కేంద్ర బడ్జెట్ పై విమర్శలు చేసే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యాంగాన్ని మార్చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, అంబేద్కర్ ని అవమానించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణం అయ్యాయి.

అసలు కేసీఆర్ ఏమన్నారు..?
“రాజ్యాంగం ద్వారా లభించిన అవకాశాలతో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 50 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్న అనుభవంతో చెప్తున్నా.. ప్రస్తుత వ్యవస్థతో ఏదీ మారదు. ఈ దేశంలో కొత్త రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉంది. దేశం ముందు నేను పెడుతున్న ఈ ప్రతిపాదనపై చర్చ జరగాలి..” అని అన్నారు కేసీఆర్. చాలా దేశాలు తమ రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్నాయని.. కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త రాజ్యాంగం అన్నది తమ విధానమని వెల్లడించారాయన.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా అభివృద్ధి జరగలేదని, మనది ధనవంతమైన దేశమైనా ఆలోచనలో పేదరికం ఉందని కేంద్ర ప్రభుత్వాలను విమర్శించారు కేసీఆర్. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారయ్యే సామర్థ్యమున్నా కాంగ్రెస్, బీజేపీల చేతగానితనం వల్లే భారత్ అంధకారంలో మగ్గిపోతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అయితే అదే క్రమంలో రాజ్యాంగాన్ని మార్చివేయాలని కేసీఆర్ అన్న మాటల్ని ఇప్పుడు బీజేపీ హైలెట్ చేస్తోంది.

తెలంగాణ బీజేపీ నేతలు వెంటనే ఈ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ని అవమానించారని అన్నారు బండి సంజయ్. దళితుడైనందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు బహిష్కరించారని, దళితుల విషయంలో కుట్రకోణాన్ని కేసీఆర్ బహిర్గతం చేశారని విమర్శించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ భాష అవమానకరం, జుగుప్సాకరం, అసహ్యకరంగా ఉందని అన్నారు. కేసీఆర్ కి బంధుప్రీతి ఎక్కువని, ఆయన తన కొడుకు, కూతురు, అల్లుడు, మనవడి కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు ఈటల. రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే దళితజాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

First Published:  2 Feb 2022 6:03 AM GMT
Next Story