సాదా సీదాగా కేంద్ర బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ అంటే ఆ హడావిడే వేరు. రేట్లు పెరిగేవి, రేట్లు తగ్గేవి, కేంద్రం ఇచ్చే వరాలు, రాయితీలు.. ఇలా అంకెల కసరత్తు బాగానే జరుగుతుంది. కానీ ఈ దఫా మాత్రం కేంద్ర బడ్జెట్ ఎవరినీ పెద్దగా మెప్పించలేకపోయింది. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని 15వేల కోట్ల రూపాయలనుంచి […]

కేంద్ర బడ్జెట్ అంటే ఆ హడావిడే వేరు. రేట్లు పెరిగేవి, రేట్లు తగ్గేవి, కేంద్రం ఇచ్చే వరాలు, రాయితీలు.. ఇలా అంకెల కసరత్తు బాగానే జరుగుతుంది. కానీ ఈ దఫా మాత్రం కేంద్ర బడ్జెట్ ఎవరినీ పెద్దగా మెప్పించలేకపోయింది. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని 15వేల కోట్ల రూపాయలనుంచి లక్ష కోట్లకు పెంచారు.
ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా నిర్వహించే విద్యా టీవీ ఛానెల్స్ 12 ఉండగా.. వాటి సంఖ్యను 200కు పెంచుతూ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది. ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు నేర్పేందుకు వీటి సంఖ్యను పెంచారు. 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రెడేషన్ చేయబోతున్నారు. 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు అందబాటులోకి రాబోతున్నాయి. అన్ని పోస్టాఫీసుల్లో ఈ బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై చిప్ ఆధారిత డిజిటల్ పాస్ పోర్టులు మంజూరు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరపాలని నిర్ణయించారు. అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పేపర్ లెస్ పాలన జరపబోతున్నట్టు తెలిపారు.
పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు జరిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నూతనంగా 80 లక్షల ఇళ్లు నిర్మాణం చేయబోతున్నారు. వచ్చే 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం చేపడతారు. నూతనంగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు.
డిజిటల్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రతిపాదించారు. 250 కోట్ల రూపాయల వ్యయంతో 5 విద్యా సంస్థల ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2025 నాటికి అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం తీసుకొస్తున్నట్టు తెలిపారు. రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిలో మీటర్ల మేర రోప్ వే లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు.
త్వరలో డిజిటల్ కరెన్సీ..
త్వరలో ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ప్రవేశ పెట్టబోతోంది. క్రిప్టో కరెన్సీకి పోటీగా దీన్ని తెరపైకి తేబోతున్నారు.
డిజిటల్ కరెన్సీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు. త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. పెట్రో డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహంతో కేంద్రం ఈ బడ్జెట్ లో చర్యలు తీసుకుంటోంది.
చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ పథకం అమలు చేయబోతోంది కేంద్రం. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్ వర్క్ ఉపయోగించుకోబోతున్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్ డ్రోన్ లు అభివృద్ధి చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కృష్ణా,పెన్నా, కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళికను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్ ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ, ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభతరం చేశారు. రెండేళ్ల దాకా రిటర్న్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
ఇక తాజా బడ్జెట్ తర్వాత విదేశాలనుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. వస్త్రాలు, నగలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ చార్జీలు, చెప్పుల ధరలు తగ్గుతాయి.