Telugu Global
NEWS

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

పెరుగుతున్న కరోనా కేసులతో.. విద్యారంగంపై మరోసారి తీవ్ర ప్రభావం పడింది. ఏపీ మినహా మిగతా చాలా చోట్ల ప్రత్యక్ష బోధన ఆగిపోయింది. అయితే కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు ధైర్యం చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పుడల్లా స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యా శాఖ. సిలబస్ తగ్గింపు.. ఛాయిస్ పెంపు.. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం […]

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
X

పెరుగుతున్న కరోనా కేసులతో.. విద్యారంగంపై మరోసారి తీవ్ర ప్రభావం పడింది. ఏపీ మినహా మిగతా చాలా చోట్ల ప్రత్యక్ష బోధన ఆగిపోయింది. అయితే కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు ధైర్యం చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పుడల్లా స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యా శాఖ.

సిలబస్ తగ్గింపు.. ఛాయిస్ పెంపు..
టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సిలబస్ తగ్గించడంతో పాటు ఛాయిస్ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. గత ఏడాదిలాగా ఈ ఏడాది కూడా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయి. సగానికి సగం ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి. 60 మార్కుల పేపర్లో 110 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అందులో విద్యార్థుల ఛాయిస్ ప్రకారం 60మార్కులకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. 100 మార్కుల పేపర్లో 210 మార్కుల ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.

ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం..
సంక్రాంతి సెలవల తర్వాత ఈనెల 17నుంచి తెలంగాణలో స్కూళ్లు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా.. వాటిని ఈనెల 30వరకు మూసి ఉంచాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే విద్యార్థులు క్లాసులకు దూరమవుతున్నారనే భావనతో ఆన్ లైన్ క్లాసులను కూడా ప్రారంభిస్తోంది. ఈనెల 24నుంచి, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్. విద్యార్థులు నష్టపోకుండా సోమవారం నుంచి టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ఆన్‌ లైన్‌ క్లాసులు మొదలు పెడతామన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్.. 50 శాతం మంది చొప్పున రోజు మార్చి రోజు విధులకు హాజరై, ఆన్ లైన్ తరగతులను పర్యవేక్షించాలని సూచించారు అధికారులు. పరిస్థితులను బట్టి మిగతా తరగతులకు కూడా ఆన్‌ లైన్‌ క్లాసులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారానికి కరోనా కేసుల సంఖ్య తగ్గకపోతే ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయని ముందుగానే హింట్ ఇచ్చారు.

First Published:  22 Jan 2022 8:22 PM GMT
Next Story