Telugu Global
National

ఆమ్ ఆద్మీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్..

ముందు అనుకున్నట్టుగానే పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఆ ప్రకటనకు ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకుంది. అభిప్రాయాల సేకరణ కూడా ఏకపక్షంగానే జరగడంతో.. అందరూ భగవంత్ మాన్ పేరుని సిఫారసు చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 48ఏళ్ల భగవంత్‌ మాన్‌ ప్రస్తుతం పంజాబ్ లోని సంగ్రూర్‌ నుంచి లోక్‌ సభ ఎంపీగా ఉన్నారు. ఆప్‌ పంజాబ్‌ యూనిట్‌ కి ఆయన […]

ఆమ్ ఆద్మీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్..
X

ముందు అనుకున్నట్టుగానే పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఆ ప్రకటనకు ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకుంది. అభిప్రాయాల సేకరణ కూడా ఏకపక్షంగానే జరగడంతో.. అందరూ భగవంత్ మాన్ పేరుని సిఫారసు చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

48ఏళ్ల భగవంత్‌ మాన్‌ ప్రస్తుతం పంజాబ్ లోని సంగ్రూర్‌ నుంచి లోక్‌ సభ ఎంపీగా ఉన్నారు. ఆప్‌ పంజాబ్‌ యూనిట్‌ కి ఆయన అధ్యక్షుడు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనుకున్నారు. కానీ చివరి నిముషంలో కేజ్రీవాల్ ఓ వినూత్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారం పంజాబ్ ప్రజలకే ఇస్తున్నామన్నారు. మొబైల్ నెంబర్ ప్రకటించి, దానికి మెసేజ్ కానీ, కాల్ చేసి కానీ తాము మద్దతిచ్చే అభ్యర్థి పేరు సూచించాలని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొత్తం 21.59లక్షల మంది తమ అభిప్రాయాలు తెలియజేయగా.. 93.3శాతం మంది భగవంత్‌ మాన్‌ ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు.

సిద్ధూకి కూడా ఓట్లు..
విచిత్రం ఏంటంటే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ పేరు కూడా ఈ సర్వేలో తెరపైకి వచ్చింది. సిద్ధూ పేరుని 3 శాతం మంది సూచించారు. మరికొందరు కేజ్రీవాల్ పేరు కూడా సూచించడం విశేషం. మొత్తమ్మీద.. పంజాబ్ ప్రజల ఎంపిక, ఎన్నిక అంటూ.. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు ప్రకటించారు కేజ్రీవాల్. పంజాబ్ లో కాంగ్రెస్ కి ఆప్ గట్టిపోటీ ఇస్తుందనే ప్రచారం ఉంది. 117 అసెంబ్లీ స్థానాల పంజాబ్ లో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ.. 20 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తర్వాత ఆమ్ ఆద్మీ నుంచి అధికార కాంగ్రెస్ లోకి కొంతమంది వలస వెళ్లారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ఆప్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

First Published:  18 Jan 2022 5:11 AM GMT
Next Story