Telugu Global
National

యోగీ సీటు మారింది.. ఎన్నికల లెక్కలు మారతాయా..?

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పోటీ చేసే నియోజకవర్గం చివరి నిముషంలో మారింది. ఆయోధ్య లేదా మధుర నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలుస్తారని నిన్నటి వరకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయోధ్య నుంచే యోగీ పోటీ ఖాయమైందని, ఈమేరకు ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటన వస్తుందని ఆశించారంతా. ఆయోధ్య కేంద్రంగా ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందుకు అనుగుణంగానే సాగాయి. అయితే అకస్మాత్తుగా ఆయన పోటీచేయబోతున్న నియోజకవర్గం మారింది. మధుర, […]

యోగీ సీటు మారింది.. ఎన్నికల లెక్కలు మారతాయా..?
X

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పోటీ చేసే నియోజకవర్గం చివరి నిముషంలో మారింది. ఆయోధ్య లేదా మధుర నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలుస్తారని నిన్నటి వరకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయోధ్య నుంచే యోగీ పోటీ ఖాయమైందని, ఈమేరకు ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటన వస్తుందని ఆశించారంతా. ఆయోధ్య కేంద్రంగా ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందుకు అనుగుణంగానే సాగాయి. అయితే అకస్మాత్తుగా ఆయన పోటీచేయబోతున్న నియోజకవర్గం మారింది. మధుర, అయోధ్య కాకుండా ఆయన్ను గోరఖ్ పూర్ అర్బన్ స్థానానికి పంపించింది అధిష్టానం. 107మందితో బీజేపీ ప్రకటించిన యూపీ తొలి జాబితాలో యోగికి గోరఖ్ పూర్ స్థానం ఖరారైంది.

గోరఖ్ పూర్ కొత్తేమీ కాదు.. కానీ..
గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి యోగీ వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన హవా చూపించారు. అయితే ఇప్పుడది అంత సేఫ్ ప్లేస్ కాదు. గోరఖ్ పూర్ పూర్వాంచల్ ప్రాంతంలో ఉంది. ఇటీవల బీజేపీకి గుడ్‌ బై చెప్పి ఎస్పీలో చేరిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్‌ నేతల్లో ఎక్కువ మంది పూర్వాంచల్‌ ప్రాంతానికి చెందినవారే. దీంతో వీరి ప్రభావం పూర్వాంచల్ లోని 17 జిల్లాలపై ఉంటుందని అంటున్నారు. యూపీలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే పూర్వాంచల్‌ లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అవసరం.

యోగికి అగ్ని పరీక్ష..
ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి బలంగా ఉన్నచోట పంతానికి పోయి నామినేషన్ వేసి అభాసుపాలయ్యారు మమతా బెనర్జీ. పార్టీ గెలిచినా, తాను ఓడారు, ఆ తర్వాత మరో చోటనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం సీటు పదిలం చేసుకున్నారు. ఇప్పుడు యూపీలో యోగి పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి పూర్వాంచల్ లో బీజేపీ వీక్ గా ఉంది. అయోధ్య, మధుర వంటి పట్టున్న నియోజకవర్గాలను పక్కనపెట్టి యోగిని గోరఖ్ పూర్ కి పంపించడంలో అధినాయకత్వం అంచనాలు వేరే ఉన్నాయి. సీఎం అక్కడ పోటీ చేస్తే, పార్టీ పరిస్థితి కూడా మెరుగవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. గోరఖ్ పూర్ విషయంలో యోగి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం యూపీ శాసన మండలిలో సభ్యుడు. పదవీ కాలం ఈ ఏడాది జులై 6వరకు ఉంది. ఒకవేళ గోరఖ్ పూర్ లో ఓడిపోయి, పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ వస్తే.. యోగి సీఎం సీటుకి వచ్చిన ముప్పేమీలేదు. అయితే ఇప్పటికే యూపీలో యోగికి ప్రత్యామ్నాయంగా చాలామందిని తెరపైకి తెచ్చింది అధిష్టానం. వేటు వేయడంలో గతంలో వేచి చూసింది, ఇప్పుడు యూపీలో ఫలితాలు తేడా వస్తే మాత్రం యోగి రాజకీయ ప్రయాణంలో కుదుపు రావడం మాత్రం ఖాయం.

First Published:  16 Jan 2022 9:38 PM GMT
Next Story