Telugu Global
Health & Life Style

టీకాలకు పెరుగుతున్న డిమాండ్.. రాత్రి 10గంటల వరకు వ్యాక్సిన్ కేంద్రాలు..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం అందుకుంది. అటు టీనేజ్ వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించడంతో భారత్ లో రోజువారీ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగింది. ఓ దశలో దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే కోటి వ్యాక్సిన్లు అందించి రికార్డ్ సృష్టించారు అధికారులు. ఆ తర్వాత స్పెషల్ డ్రైవ్ లు లేకపోవడం, కొవిడ్ వ్యాప్తి తగ్గిపోవడంతో జనం కూడా టీకాలంటే వెనకడుగు వేశారు. చాలామంది ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్ మరచిపోయారు. ఈ […]

టీకాలకు పెరుగుతున్న డిమాండ్.. రాత్రి 10గంటల వరకు వ్యాక్సిన్ కేంద్రాలు..
X

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం అందుకుంది. అటు టీనేజ్ వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించడంతో భారత్ లో రోజువారీ వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగింది. ఓ దశలో దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే కోటి వ్యాక్సిన్లు అందించి రికార్డ్ సృష్టించారు అధికారులు. ఆ తర్వాత స్పెషల్ డ్రైవ్ లు లేకపోవడం, కొవిడ్ వ్యాప్తి తగ్గిపోవడంతో జనం కూడా టీకాలంటే వెనకడుగు వేశారు. చాలామంది ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్ మరచిపోయారు. ఈ దశలో ఇప్పుడు మళ్లీ టీకాలకు మెల్ల మెల్లగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచే ఉంచేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇప్పటి వరకూ భారత్ లో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్.. ఇలా అన్నీ కలిపి 151.9 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందించారు. 2.38 కోట్ల మంది టీనేజర్లకు కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. డిసెంబర్ లో సగటున రోజువారీ వినియోగించే టీకాల సంఖ్య 15 లక్షలకంటే తక్కువగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ భయాల నేపధ్యంలో మళ్లీ టీకాల కోసం జనం క్యూ కడుతున్నారని తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో.. 24.4 లక్షలమంది కొవిడ్ టీకాలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఒకేరోజు అత్యథిక వ్యాక్సిన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో ప్రజలనుంచి వస్తున్న డిమాండ్ మేరకు టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ సమయాన్ని కూడా పొడిగించింది కేంద్రం. ప్రికాషనరీ డోస్ కూడా మొదలు పెట్టడంతో దానికి అనుగుణంగా సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని.. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగొచ్చని అప్రమత్తం చేశారు. ఎక్కువ సంఖ్యలో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా రోగుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉండాలని.. ఆయా ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కేంద్రాల పని వేళల్ని రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను రాత్రి 10గంటల వరకు తెరిచే ఉంచాలని, దానికి తగ్గట్టు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలని కోరారు.

First Published:  10 Jan 2022 8:25 PM GMT
Next Story