ప్రధాని టూర్ ఎఫెక్ట్.. పంజాబ్ కి కొత్త డీజీపీ..
పంజాబ్ డీజీపీ పదవి ఎక్కడలేని రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఈమధ్యే డీజీపీ నియామకంలో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మధ్య విభేదాలొచ్చాయి. అవి ఓ కొలిక్కి వచ్చి నెలరోజుల క్రితమే పంజాబ్ కొత్త డీజీపీగా సిద్దార్థ్ ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. అయితే ఆయన పదవి నెళ్లాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. సరిగ్గా నెల తిరిగే లోగా ఆయన సీటు కిందకి కూడా నీళ్లొచ్చాయి. అయితే ఆ నీళ్లు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన […]

పంజాబ్ డీజీపీ పదవి ఎక్కడలేని రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఈమధ్యే డీజీపీ నియామకంలో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మధ్య విభేదాలొచ్చాయి. అవి ఓ కొలిక్కి వచ్చి నెలరోజుల క్రితమే పంజాబ్ కొత్త డీజీపీగా సిద్దార్థ్ ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. అయితే ఆయన పదవి నెళ్లాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. సరిగ్గా నెల తిరిగే లోగా ఆయన సీటు కిందకి కూడా నీళ్లొచ్చాయి. అయితే ఆ నీళ్లు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రూపంలో రావడం విశేషం.
పంజాబ్ లో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ నిలిచిపోవడం, నిరసన కారులు ప్రధాని మోదీ పర్యటిస్తున్న రోడ్డుపైకి రావడం, ట్రాఫిక్ లోనే ప్రధాని 20నిమిషాలపాటు వేచి చూడాల్సి రావడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో పంజాబ్ డీజీపీని ఆ పదవినుంచి తొలగించారు. వాస్తవానికి ఆయన రెండేళ్లపాటు, అంటే 2024 జనవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ దేశ ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అలసత్వంగా ఉన్నందున, డీజీపీని అత్యవసరంగా ఆ పదవినుంచి సాగనంపారు.
కొత్త డీజీపీగా వీరేశ్ కుమార్ భవ్రా..
పంజాబ్ నూతన డీజీపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. భవ్రా నియామకానికి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ఆమోదం తెలిపారు. యు.పి.ఎస్.సి. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల నుంచి పంజాబ్ ప్రభుత్వం 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీకే భవ్రాను ఎంపిక చేసింది. ఈ జాబితాలో భవ్రాతోపాటు దినకర్ గుప్తా, ప్రభోద్ కుమార్ కూడా ఉన్నారు. అయితే పంజాబ్ సీఎం, వీరేశ్ కుమార్ వైపు మొగ్గు చూపారు.