Telugu Global
NEWS

100 ఎలుకల్ని తిన్న పిల్లి శాఖాహారి అవుతుందా..?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బండి సంజయ్ అరెస్ట్, విడుదల అనంతరం తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. బండి సంజయ్ ని కలసి అభినందిస్తూ.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేవలం రెండోసారి ముఖ్యమంత్రి అని, తాను నాలుగో దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నానని అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. కేసీఆర్ కి కలలో కూడా సంజయ్ గుర్తొస్తున్నారని, వారి బెదిరింపులకి బీజేపీ భయపడబోదని స్పష్టం చేశారు. […]

100 ఎలుకల్ని తిన్న పిల్లి శాఖాహారి అవుతుందా..?
X

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బండి సంజయ్ అరెస్ట్, విడుదల అనంతరం తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. బండి సంజయ్ ని కలసి అభినందిస్తూ.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేవలం రెండోసారి ముఖ్యమంత్రి అని, తాను నాలుగో దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నానని అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. కేసీఆర్ కి కలలో కూడా సంజయ్ గుర్తొస్తున్నారని, వారి బెదిరింపులకి బీజేపీ భయపడబోదని స్పష్టం చేశారు. బీజేపీ అంటే బిర్యానీ పార్టీ కాదని అన్నారు.

కేసీఆర్ సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో ధర్మయుద్దం మొదలైందని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని జోస్యం చెప్పారాయన.

శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. 100 ఎలుకల్ని తిన్న పిల్లి శాఖాహారి అవుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు. నాలుగు దఫాలుగా సీఎం గా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం సాధించారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణానికి ఎవరు జవాబుదారీ అని నిలదీశారు. ఏకంగా హత్య కేసుల్లోనే శివరాజ్ సింగ్ కుటుంబ సభ్యులకు, ఆ పార్టీ నేతలకు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని అన్నారు హరీష్ రావు. జీవో 317 ని రద్దు చేయాలంటే, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ని, కేసీఆర్ ని విమర్శించే నైతిక హక్కు శివరాజ్ సింగ్ కి లేదని, దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ ఆయన సీఎం అయ్యారంటూ మండిపడ్డారు హరీష్ రావు.

First Published:  8 Jan 2022 5:56 AM GMT
Next Story