Telugu Global
National

యోగీని వెంటాడుతున్న సర్వేలు.. ఎన్నికల వేళ యూపీలో కలకలం..

అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ ముంచుకొస్తున్న వేళ, యూపీలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ చెమటోడుస్తోంది. ప్రధాని మోదీ యూపీలో వరుస పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాలేజీ యువతకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు ఉచితంగా ఇస్తూ సీఎం యోగి, యువ ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. ఈ దశలో పలు సర్వేలు యోగి సర్కారుకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ ఆరోగ్య నివేదికలో ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంతో […]

యోగీని వెంటాడుతున్న సర్వేలు.. ఎన్నికల వేళ యూపీలో కలకలం..
X

అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ ముంచుకొస్తున్న వేళ, యూపీలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ చెమటోడుస్తోంది. ప్రధాని మోదీ యూపీలో వరుస పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాలేజీ యువతకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు ఉచితంగా ఇస్తూ సీఎం యోగి, యువ ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. ఈ దశలో పలు సర్వేలు యోగి సర్కారుకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ ఆరోగ్య నివేదికలో ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తాజాగా మహిళలపై జరిగిన నేరాల విషయంలో యూపీ టాప్ ప్లేస్ లో ఉందని జాతీయ మహిళా కమిషన్ ఓ జాబితా విడుదల చేసింది.

2021లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన నేరాల సంఖ్య అత్యథికం అని జాతీయ మహిళా కమిషన్ తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా 30,864 ఫిర్యాదులు రాగా.. అందులో 15,828 ఫిర్యాదులు కేవలం ఉత్తర ప్రదేశ్‌ నుంచే వచ్చాయని జాతీయ మహిళా కమిషన్‌ గణాంకాలు చెబుతున్నాయి. యూపీ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (3,336), మహారాష్ట్ర (1,504), హర్యానా (1,460), బీహార్‌ (1,456) ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన 30,864 ఫిర్యాదుల్లో 11,013 ఫిర్యాదులు మహిళలను కించపర్చడం, వారి గౌరవానికి భంగం కలిగించిన కేసుల్లో నమోదవడం విశేషం. గృహ హింసకు సంబంధించి 6,633, వరకట్నం వేధింపులకు చెందినవి 4,589 ఫిర్యాదులు ఉన్నాయి.

గతంలో మహిళల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా గృహహింస, వరకట్న వేధింపులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మహిళలను కించపరడం, వారి గౌరవానికి భంగం కలిగించడం వంటి కేసులు ఎక్కువయ్యాయి. గతంతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. మహిళల హక్కులు, వారి గౌరవం గురించి నాయకులు ఉపన్యాసాలు దంచుతున్నారే కానీ.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రే వేరేలా ఉంటున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలు 23,722 కాగా, 2021 నాటికి దాదాపు 30 శాతం పెరిగాయి. 2014 తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో ఫిర్యాదులు రావడం కూడా ఇదే తొలిసారి అని అంటున్నారు. ముఖ్యంగా యూపీలో కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల వేళ.. యూపీ ప్రతిష్టను దిగజార్చే ఇలాంటి ఫలితాలు సీఎం యోగీకి తలనొప్పిగా మారాయి.

First Published:  1 Jan 2022 11:46 PM GMT
Next Story