Telugu Global
NEWS

జిన్నా టవర్ చరిత్ర ఇదీ..

గుంటూరులోని జిన్నా టవర్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఆ టవర్ ని కూల్చేయాలని, లేదా పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కి ఓ అభ్యర్థన అందించింది. అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జిన్నా టవర్ పేరు తెరపైకి తెచ్చారని, స్వాతంత్రానికి ముందు నిర్మించిన స్థూపం గురించి ఇప్పుడెందుకు బీజేపీ గొడవ చేస్తోందని వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు […]

జిన్నా టవర్ చరిత్ర ఇదీ..
X

గుంటూరులోని జిన్నా టవర్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఆ టవర్ ని కూల్చేయాలని, లేదా పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కి ఓ అభ్యర్థన అందించింది. అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జిన్నా టవర్ పేరు తెరపైకి తెచ్చారని, స్వాతంత్రానికి ముందు నిర్మించిన స్థూపం గురించి ఇప్పుడెందుకు బీజేపీ గొడవ చేస్తోందని వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిన్నా టవర్ గుంటూరులో ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం.

స్వాతంత్రానికి పూర్వం 1942లో ఇప్పటి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడి గ్రామానికి చెందిన 14మందికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. వారికోసం అప్పటి ముస్లిం నాయకుడు లాల్ జాన్ బాషా న్యాయపోరాటం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ లాల్ జాన్ బాషాకు ఆయన తాత అవుతారు. ఈ క్రమంలో ముంబై కోర్టులో లాయర్ గా పనిచేస్తున్న అప్పటి ముస్లిం లీగ్ అధినేత మహ్మద్ అలీ జిన్నా.. లాల్ జాన్ బాషాకు సాయం చేశారు. వారి తరపున వాదించి ఉరిశిక్ష రద్దు చేయించారు. దీనికి కృతజ్ఞతగా గుంటూరులో జిన్నా టవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి జిన్నాను ఆహ్వానించినా.. ఆయన రాలేకపోయారు. ఆయన అనుచరుడు లియాఖత్ అలీఖాన్ 1945లో జిన్నా టవర్ ప్రారంభించారు.

గుంటూరు చైర్మన్లుగా పనిచేసిన నడింపల్లి నరసింహారావు, తెలకుల జాలయ్య వారి వారి హయాంలో ఈ టవర్ నిర్మాణం మొదలు పెట్టారని.. శాంతి, పరమత సహనానికి ప్రతిగా దీన్ని నిర్మించారని మరో కథనం ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటి వరకూ జిన్నా టవర్ పై ఎలాంటి వివాదం రాలేదు. కానీ ఈ టవర్‌ సెంటర్‌ పేరు మార్చుతూ 1965-66 మధ్య అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ సైనికుడు హమీద్‌ ఆ వీరమరణం పొందారని, ఆయన గౌరవార్థం జిన్నాటవర్‌ పేరును హమీద్‌ మందిర్‌గా మార్చుతూ తీర్మానం చేశారని అంటారు. కానీ ఆ తీర్మానం అమలులోకి రాలేదు.

ప్రస్తుతం బీజేపీ నాయకుల డిమాండ్ తో ఇప్పుడు జిన్నా టవర్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ టవర్ కి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లాభం కోసం చేసిన వితండవాదంగా పేర్కొంటున్నాయి.

First Published:  31 Dec 2021 3:58 AM GMT
Next Story