Telugu Global
National

ప్రధాని కారుపై మాటల తూటాలు.. విమర్శలపై కేంద్రం వివరణ..

తూటాలనుంచి రక్షణకోసం, పేలుళ్ల నుంచి భద్రతకోసం.. ప్రధాని నరేంద్రమోదీ కొత్తకారు తీసుకున్నారు కానీ.. ప్రతిపక్షాల మాటల తూటాలనుంచి మాత్రం ఆ కారు తప్పించుకోలేకపోయింది. ఫకీర్ బతుకు అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టడంతో కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఫకీర్ లాగా బతకాలని చెప్పుకునే బీజేపీ నేతలు.. మోదీ విలాసాల విషయంలో ఏమంటారని నిలదీశారు కాంగ్రెస్ నేతలు. ఆకాశంలో తిరిగేందుకు రూ.8,000 కోట్ల విమానం, భూమి మీద తిరిగేందుకు రూ.20 కోట్ల కారు, […]

ప్రధాని కారుపై మాటల తూటాలు.. విమర్శలపై కేంద్రం వివరణ..
X

తూటాలనుంచి రక్షణకోసం, పేలుళ్ల నుంచి భద్రతకోసం.. ప్రధాని నరేంద్రమోదీ కొత్తకారు తీసుకున్నారు కానీ.. ప్రతిపక్షాల మాటల తూటాలనుంచి మాత్రం ఆ కారు తప్పించుకోలేకపోయింది. ఫకీర్ బతుకు అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టడంతో కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఫకీర్ లాగా బతకాలని చెప్పుకునే బీజేపీ నేతలు.. మోదీ విలాసాల విషయంలో ఏమంటారని నిలదీశారు కాంగ్రెస్ నేతలు. ఆకాశంలో తిరిగేందుకు రూ.8,000 కోట్ల విమానం, భూమి మీద తిరిగేందుకు రూ.20 కోట్ల కారు, ఇల్లు కట్టేందుకు రూ.2,000 కోట్లు. ఫకీర్‌ బతుకంటే ఇదే కాబోలు.. అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ ఎద్దేవా చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో మోదీ కారు బాగా హైలెట్ అయింది. ప్రధాని కొత్త కారు ధర 12 కోట్ల రూపాయలంటూ ప్రచారం జరిగింది. దాని ప్రత్యేకతలు, సౌకర్యాలపై మీడియా, సోషల్ మీడియోలో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇప్పటి వరకూ ప్రధాని మోదీ బీఎండబ్ల్యూ కారు ఉపయోగించేవారు. ఆ మోడల్ కార్ల తయారీని బీఎండబ్ల్యూ నిలిపివేయడంతో, ఆయన భద్రత దృష్ట్యా కొత్తగా మెర్సిడెస్-మేబ్యాక్ S 650 కారు కొనుగోలు చేశారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ కారుని తయారు చేశారు. 2 మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా కారులో ఉన్నవారికి ఏమీ కాదు. డైరెక్ట్ ఎక్స్ ప్లోజన్ ని కూడా కారు బాడీ తట్టుకుని నిలబడగలదు. గ్యాస్ అటాక్ జరిగితే తప్పించుకునేందుకు కారులో ప్రత్యేకంగా ఎయిర్ సప్లై కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైమాటేనని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కాస్తా ప్రధానిపై విమర్శలకు ఊతం ఇవ్వడంతో కేంద్రం వెంటనే వివరణ ఇచ్చింది.

అత్యున్నత స్థాయి ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ ప్రమాణాల ప్రకారం ప్రధాని ఒకే కారును ఆరేళ్లకు మించి ఉపయోగించకూడదని, అందుకే కారుని మార్చామని కేంద్రం స్పష్టం చేసింది. అదే కారు కావాలంటూ ప్రధాని మోదీ నుంచి సలహాలు, సూచనలేవీ రాలేదని చెప్పింది. తన కాన్వాయ్‌ లో ఎటువంటి వాహనాలు వాడుతున్నారనే విషయం ప్రధాని మోదీ ఎప్పుడూ పట్టించుకోలేదని, గత ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం తీసుకున్న కారునే ఆయన ఇప్పటి వరకూ వాడారని, ఎస్పీజీ ప్రమాణాల ప్రకారం ఇప్పుడు కొత్త కారు తేవాల్సి వచ్చిందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాదు… ధర విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయని, ఆ కారు ధర మీడియాలో ప్రచారం జరుగుతున్న ధరలో మూడోవంతు ఉండొచ్చని తెలిపారు అధికారులు. అంటే కేవలం మూడుకోట్లేనని పరోక్షంగా చెప్పారు. గతంలో విదేశీ ప్రముఖులు భారత్ వస్తూ, వారి వ్యక్తిగత వాహనాలు కూడా తీసుకొస్తే.. అలాంటి వాటి గురించి ఇక్కడ విపరీతమైన విశ్లేషణలు ప్రచారం జరిగేవి. తొలిసారిగా భారత్ లో ప్రధాని వాహనం గురించి తీవ్ర చర్చ జరగడం ఇదే తొలిసారి. దీంతో కేంద్రం వెంటనే వివరణ ఇచ్చుకుంది.

First Published:  29 Dec 2021 10:07 PM GMT
Next Story