Telugu Global
National

కొత్త సంవత్సరంలో పిల్లలకు కొవిడ్ టీకా.. వృద్ధులకు బూస్టర్ డోస్..

జనవరి 3నుంచి చిన్న పిల్లల టీకా భారత్ లో పంపిణీ చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకా వేస్తామని తెలిపారు. అదే సమయంలో వ్యాధులబారినపడిన వృద్ధులకు కూడా కొత్త ఏడాది నుంచి బూస్టర్ డోస్ మొదలు పెట్టబోతున్నట్టు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కీలక ప్రకటన చేశారు. 10కోట్లమందికి టీకా.. ప్రస్తుతం భారత్ లో 18 ఏళ్లు పైబడిన వయోజనులకు మాత్రమే కొవిడ్ టీకా వేస్తున్నారు. […]

కొత్త సంవత్సరంలో పిల్లలకు కొవిడ్ టీకా.. వృద్ధులకు బూస్టర్ డోస్..
X

జనవరి 3నుంచి చిన్న పిల్లల టీకా భారత్ లో పంపిణీ చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకా వేస్తామని తెలిపారు. అదే సమయంలో వ్యాధులబారినపడిన వృద్ధులకు కూడా కొత్త ఏడాది నుంచి బూస్టర్ డోస్ మొదలు పెట్టబోతున్నట్టు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కీలక ప్రకటన చేశారు.

10కోట్లమందికి టీకా..
ప్రస్తుతం భారత్ లో 18 ఏళ్లు పైబడిన వయోజనులకు మాత్రమే కొవిడ్ టీకా వేస్తున్నారు. పిల్లల టీకాలు ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చినా కూడా భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ దానిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్ వ్యాప్తి, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని పిల్లల టీకా గురించి మాట్లాడారు. అయితే 15 ఏళ్ల పైబడినవారికి మాత్రమే దీన్ని ఇవ్వబోతున్నట్టు చెప్పారు. 15నుంచి 18ఏళ్ల మధ్యవయసున్నవారు భారత్ లో దాదాపుగా 10కోట్లమంది ఉంటారని అంచనా. వారందరికీ జనవరి 3నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు జనవరి 10నుంచి బూస్టర్ డోస్ ఇస్తామన్నారు.

థర్డ్ వేవ్ కి సన్నద్ధం..
వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు బలోపేతం అయ్యాయని చెప్పిన మోదీ.. కొవిడ్‌ తో ముప్పు తొలగిపోలేదని, నిరంతర పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్‌ బెడ్లు, 5 లక్షల ఆక్సిజన్‌ బెడ్లు, 1.5 లక్షల ఐసీయూ బెడ్లు, 90 వేల చిన్నపిల్లల పడకలు సిద్ధం చేసి ఉంచామని చెప్పారు. 3వేల ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 4 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే మన దేశంలో ముక్కు ద్వారా వేసే నాజల్ వ్యాక్సిన్‌, డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.

భారత్ లో జనవరి 26న మొదలైన వ్యాక్సినేషన్ సమర్థంగా జరుగుతోందని చెప్పారు ప్రధాని మోదీ. దేశంలో 141 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని, 61 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు. చాలా రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, వైద్య సిబ్బంది అంకితభావం, కఠోర శ్రమ వల్లే ఈ ఘనత సాధించామన్నారాయన. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందని చెప్పారు మోదీ.

First Published:  25 Dec 2021 9:43 PM GMT
Next Story