Telugu Global
National

ఎన్నికలు వాయిదా..? ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతోందని వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ ప్రతిపక్షాలు సవాళ్లు విసురుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల విషయంలో బీజేపీ ఎంత అభద్రతా భావంతో ఉందో.. ఆ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరుస పర్యటనలే తెలియజేస్తున్నాయి. రైతు చట్టాల ఉపసంహరణాస్త్రాన్ని ప్రయోగించినా.. పంజాబ్ లో పరిస్థితి మెరుగైనట్టు కనిపించడంలేదు. గోవా సహా ఇతర రాష్ట్రాల్లో కూడా టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అడుగుమోపుతున్నాయి, బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. […]

ఎన్నికలు వాయిదా..? ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
X

దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతోందని వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ ప్రతిపక్షాలు సవాళ్లు విసురుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల విషయంలో బీజేపీ ఎంత అభద్రతా భావంతో ఉందో.. ఆ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరుస పర్యటనలే తెలియజేస్తున్నాయి. రైతు చట్టాల ఉపసంహరణాస్త్రాన్ని ప్రయోగించినా.. పంజాబ్ లో పరిస్థితి మెరుగైనట్టు కనిపించడంలేదు. గోవా సహా ఇతర రాష్ట్రాల్లో కూడా టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అడుగుమోపుతున్నాయి, బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ దశలో అసలు ఎన్నికలే వాయిదా పడితే..? అలహాబాద్ హైకోర్టు సూచనతో ఎన్నికల వాయిదా అంశం తెరపైకి వచ్చింది.

2022 ఫిబ్రవరిలో యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలను వీలైతే రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వాస్తవానికి 2 నెలల వాయిదా ఎన్నికలపై ఏమంత పెద్ద ప్రభావం చూపించదు. కానీ పెరిగిపోతున్న వ్యతిరేకతను కాస్త పక్కదారి పట్టించడానికి అధికార పార్టీలకు ఓ అవకాశం దొరుకుతుందనే విషయం మాత్రం వాస్తవం. వాయిదా రెండు నెలలతో ఆగకుండా మరికొన్నాళ్లు కొనసాగితే అధికార పార్టీల చేతికి మరిన్ని అవకాశాలు వచ్చినట్టే లెక్క. అయితే ఇక్కడ కేంద్రం వెనకడుగు వేయకుండా అలహాబాద్ హైకోర్టు రూపంలో వారికి ఓ ఛాన్స్ దొరికింది.

గతంలో యూపీ పంచాయతీ ఎన్నికలు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో సెకండ్ వేవ్ కి కారణం అయ్యాయని గుర్తు చేసిన హైకోర్టు.. వైరస్‌ వ్యాప్తికి వాహకంగా మారే ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధించాలని పేర్కొంది. ప్రజలు ప్రాణాలతో ఉంటేనే ఎన్నికల ర్యాలీలు, సమావేశాలు జరుగుతాయని చెప్పింది. ఆర్టికల్‌ 21 ప్రకారం.. జీవించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని, యూపీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే చాలా చోట్ల సభలు, సమావేశాలతో పరిస్థితి చేయిదాటిపోతోందని గుర్తు చేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా స్పందించారు. యూపీలో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ప్రతిపక్షాలు ఎన్నికల వాయిదాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. యూపీ సహా ఇతర ప్రాంతాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఈ దశలో ఎన్నికలు వాయిదా వేయడమంటే అది ఆ పార్టీకి అనుకూల నిర్ణయం అవుతుందని అంటున్నారు విపక్ష నేతలు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కూడా గతంలో ఎప్పుడూ లేనట్టు విడతల వారీగా నిర్వహించడం వెనక ఉన్న వ్యూహం కూడా అదేని గుర్తు చేస్తున్నారు. మొత్తమ్మీద ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో అసెంబ్లీల ఎన్నికలు వాయిదా పడితే మాత్రం బీజేపీకి కాస్త ఊపిరి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈలోగా అద్భుతాలు జరక్కపోవచ్చు కానీ, ఎన్నికల వాయిదా అనేది బీజేపీకి అనుకోని అవకాశంగా మాత్రం చెప్పొచ్చు.

First Published:  24 Dec 2021 11:19 PM GMT
Next Story