Telugu Global
Cinema & Entertainment

శ్యామ్ సింగరాయ్ మూవీ రివ్యూ

నటీనటులు: నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, జిస్సు సేన్ గుప్తా, మనీష్ వాద్వా, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం తదితరులు మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌ కథ : స‌త్య‌దేవ్ జంగా నిర్మాణం : నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ నిర్మాత : వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్‌ విడుదల తేది : 24 డిసెంబర్ 2021 నిడివి […]

శ్యామ్ సింగరాయ్ మూవీ రివ్యూ
X

నటీనటులు: నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, జిస్సు సేన్ గుప్తా, మనీష్ వాద్వా, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం తదితరులు
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
కథ : స‌త్య‌దేవ్ జంగా
నిర్మాణం : నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాత : వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్‌
విడుదల తేది : 24 డిసెంబర్ 2021
నిడివి : 157 నిమిషాలు
రేటింగ్ : 2.5/5

కొన్ని సినిమాలపై భారీ అంచనాలుంటాయి. థియేటర్ లోకి వెళ్లిన తర్వాత ఆ అంచనాల్ని అందుకోవడంలో కొన్ని సక్సెస్ అవుతాయి, మరికొన్ని ఫెయిల్ అవుతాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటాయి. అలాంటిదే శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా బాగుంది కానీ ఏదో వెలితి. సినిమాను హిట్ అని చెప్పలేం, అలా అని ఫ్లాప్ అనలేం. ప్రతి సన్నివేశం/ఎపిసోడ్ ను మరింత బాగా తీయొచ్చనే ఫీలింగ్ కలగడం ఈ భావనకు కారణం.

ముందుగా స్టోరీ ఏంటో చెప్పుకుందాం..
ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే వాసుదేవ్ (నాని) ముందుగా తన స్టోరీతో ఓ షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు. అందులో హీరోయిన్ కోసం వెదుకుతుంటాడు. సైకాలజీ చదువుకునే కీర్తి కనిపిస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా కీర్తిని కన్విన్స్ చేసి ఆమెతో తను అనుకున్న షార్ట్ ఫిలిం తీసి, ఒక నిర్మాతకి చూపించి, సినిమా ఛాన్స్ కొట్టేస్తాడు. ఆ ప్రాసెస్ లో వాసుదేవ్ ను ఇష్టపడుతుంది కీర్తి. అయితే ఓ సందర్భంలో వాసు నోటి నుండి ‘రోసీ’ అనే పేరు రావడంతో అతనికి దూరమౌతుంది.

ఎట్టకేలకు తన కథను ‘వర్ణం’ అనే సినిమాగా తీసి దర్శకుడిగా విజయం అందుకున్న వాసుదేవ్ కి దాన్ని హిందీలో రీమేక్ చేయమని ఓ భారీ ఆఫర్ వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసేలోపు కాపీరైట్ కేసులో వాసుదేవ్ అరెస్ట్ అయి జైలుకి వెళ్తాడు. శ్యామ్ సింగ రాయ్ అనే రచయిత కొన్నేళ్ళ క్రితం రాసిన కథనే వాసుదేవ్ సినిమాగా తీశాడని అతని పై ఓ పబ్లికేషన్స్ సంస్థ కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. ఆ కేసు నుండి వాసుని బయటపడేసేందుకు అడ్వకేట్ పద్మావతి (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) రంగంలోకి దిగుతుంది.

అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు? ఆతను రాసిన పుస్తకానికి వాసుదేవ్ రాసిన కథకి సంబంధం ఏమిటి ? వీరిద్దరికీ లింకేంటి ? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరోసారి పునర్జన్మలు, ఆత్మల మధ్య కనెక్షన్ లాంటి కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. కాన్సెప్ట్ పాతదే, కాకపోతే రాహుల్ టేకింగ్ కొత్తగా ఉంది. అలాఅని సినిమాను ఓకే చేసేయడానికి లేదు. ఎందుకంటే, సీన్స్ లో అతడి టేకింగ్ బాగుంది కానీ, సదరు సీన్లన్నీ రొటీన్ గా అనిపిస్తాయి. అంతా ఊహించుకున్నట్టే ఉంటాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరం. సగటు ప్రేక్షకుడు కంటే దిగువ స్థాయి ప్రేక్షకుడు కూడా ఇట్టే ఊహించుకునే క్లైమాక్స్ అది.

ఇలాంటి కథల్లో ట్విస్టులు కంటే ఎమోషన్ ముఖ్యం. ఎలాంటి ఎండింగ్ ఇచ్చామనేనది మరీ ముఖ్యం. ఈ రెండు విషయాల్లో శ్యామ్ సింగరాయ్ ఫెయిల్ అయింది. సెకెండాఫ్ లో సినిమా ఫ్లాట్ గా సాగుతుంది. క్లైమాక్స్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. మగధీర లాంటి సినిమాల టైపులో బలమైన కాన్ ఫ్లిక్ట్ లేదా ఎమోషన్ పెట్టినట్టయితే.. శ్యామ్ సింగరాయ్ మరో లెవెల్లో ఉండేది.

వాసుదేవ్, శ్యామ్ సింగరాయ్ అనే రెండు పాత్రల్లో నాని చక్కగా చేశాడు. మరీ ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ గా నాని మేకోవర్ బాగుంది. సాయిపల్లవి ఎప్పట్లానే మరోసారి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. పాత్ర కోసం డైరక్టర్ చెప్పింది చేయడానికి ఆమె ఏమాత్రం వెనకాడదనే విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది. కృతి షెట్టి గ్లామరస్ గా ఆకట్టుకుంది. మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవింద్రన్ కు మంచి పాత్రలు పడ్డాయి. ప్రతి పాత్రకు సరైన నటీనటుల్ని తీసుకున్నారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ లో తన మార్క్ చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను ప్రత్యేక ప్రశంసించాల్సిందే. ఇక మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్లస్ అయ్యాడు తప్ప, పాటలతో ఆకట్టుకోలేకపోయాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ.. దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ లో దర్శకుడు పూర్తిస్థాయిలో ఎలివేట్ అయ్యాడు. చప్పట్లు కొట్టించే డైలాగ్స్ లేకపోయినా, మాటలు కూడా ఉన్నంతలో ఓకే. కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం రాహుల్ కు సగం మార్కులే పడతాయి.

ఓవరాల్ గా మంచి నటీనటులున్నప్పటికీ, టెక్నికల్ గా బాగున్నప్పటికీ శ్యామ్ సింగరాయ్ సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు. అలాగని తీసిపారేసే సినిమా కూడా కాదు. ఏదో వెలితి మనసులో అలా మిగిలిపోతుందంతే.

First Published:  24 Dec 2021 8:53 AM GMT
Next Story