Telugu Global
Cinema & Entertainment

పుష్ప మూవీ రివ్యూ

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, అనసూయ, ధనుంజయ్, అజయ్ ఘోష్ తదితరులు కెమెరామెన్: మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సహ నిర్మాత : ముత్తంశెట్టి మీడియా నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై రచన-దర్శకత్వం : సుకుమార్ నిడివి: 179 నిమిషాలు విడుదల తేది : 17 డిసెంబర్ 2021 రేటింగ్ : 2.5/5 తగ్గేదేలే.. పుష్ప సినిమాకు అనధికారికంగా ఇచ్చిన […]

allu-arjun-about-pushpa
X

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, అనసూయ, ధనుంజయ్, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరామెన్: మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సహ నిర్మాత : ముత్తంశెట్టి మీడియా
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
రచన-దర్శకత్వం : సుకుమార్
నిడివి: 179 నిమిషాలు
విడుదల తేది : 17 డిసెంబర్ 2021
రేటింగ్ : 2.5/5

తగ్గేదేలే.. పుష్ప సినిమాకు అనధికారికంగా ఇచ్చిన క్యాప్షన్ ఇది. హీరో,హీరోయిన్ నుంచి అంతా ఈ డైలాగ్ ను పాపులర్ చేశారు. దాన్ని నిజం చేస్తూ రన్ టైమ్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ 3 గంటల సినిమా చూపించారు. అదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. సెకెండాఫ్ లో నెరేషన్ స్లోగా సాగడం, హీరో-విలన్ మధ్య కాన్ ఫ్లిక్ట్ ను బలంగా చూపించకపోవడం పుష్ప సినిమాకు ప్రధాన అవరోధాలుగా మారాయి.

ముందుగా కథపై ఓ లుక్కేద్దాం.. చిత్తూరు శేషాచలం అడవుల్లో రోజుకూలీగా పనిచేస్తూ జీవితాన్ని గడిపే పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఓ సందర్భంలో డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాచ్ లోకి చేరతాడు. ఈ క్రమంలో కొండన్న (అజయ్ ఘోష్) దగ్గర ఎర్రచందనం కూలీగా పనిచేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ కొండన్నకు రైట్ హ్యాండ్ అవుతాడు. మరోవైపు శ్రీవల్లి(రష్మిక) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఆమె వెంటపడుతుంటాడు. కొండన్న దగ్గర పనిచేస్తూ ఓ టైంలో మంగళం శీను (సునీల్) కి ఎదురెళ్ళి అక్కడి ఎంపీ (రావు రమేష్) సపోర్ట్ తో సునీల్ స్థానంలో సిండికేట్ బాస్ గా మారతాడు.

అలా ఎర్రచందనం వ్యాపారానికి రారాజుగా ఎదిగిన పుష్ప నేపథ్యం ఏమిటి? పుష్పకు ఎందుకు ఇంటి పేరు ఉండదు? కూలీ స్థాయి నుండి బాస్ రేంజ్ కు ఎలా ఎలా ఎదిగాడు? ఫైనల్ గా ఆ ఏరియాకి ఎస్పీ గా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో గొడవ పెట్టుకున్న పుష్ప ఫైనల్ గా ఏ తీరం చేరాడనేది ఈ స్టోరీ.

సినిమా మొత్తం పుష్ప పాత్ర చుట్టూనే తిరుగుతుందనే విషయం కథ చూడగానే అర్థమైపోతుంది. అందుకు తగ్గట్టే దర్శకుడు సుకుమార్, పుష్ప పాత్రపై విపరీతంగా శ్రద్ధ పెట్టాడు. అతడి లుక్, మేకప్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు ప్రతిది దగ్గరుండి చూసుకున్నాడు. పుష్ప క్యారెక్టరైజేషన్ కూడా చాలా డీప్ గా ఉంటుంది. అయితే ఈ క్రమంలో మిగతా కథ నెరేషన్ పై సుక్కూ దృష్టి తగ్గించినట్టు కనిపిస్తోంది. లేదంటే సుకుమార్ నుంచి రావాల్సిన స్క్రీన్ ప్లే ఇది కాదు. సుకుమార్ సినిమాల్లో కనిపించే ఎడిటింగ్ కూడా ఇది కాదు. ఓ ముగ్గురు నలుగురు చేతులు పెట్టి ఈ సినిమాను ఇలా 3 గంటలుగా మార్చినట్టు తెలుస్తూనే ఉంది.

సినిమా స్టార్ట్ అవ్వడం సుకుమార్ స్టయిల్ లోనే స్టార్ట్ అవుతుంది. పాత్రల పరిచయం, హీరో ఎలివేషన్స్ అన్నీ బాగా కుదిరాయి. ఫస్టాఫ్ చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే, ఆ నేపథ్యం, పాత్రలు, పుష్ప ఎలివేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి. దీనికితోడు మొదటి సగంలో వచ్చిన పెళ్లిచూపులు సీన్, విలన్ ఇంట్లో పుష్ప వార్నింగ్ ఇచ్చే సీన్ అద్భుతంగా పండాయి. లవ్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోయినా సినిమా ఇబ్బంది పెట్టడు.

ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలవుతుందో, అప్పుడు అసలు సమస్య తెరపైకొస్తుంది. అప్పటికే ఇచ్చిన ఎలివేషన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ ఊపు సెకెండాఫ్ లో కనిపించదు. బలంగా పరిచయమైన సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, శత్రు పాత్రలు సెకెండాఫ్ లో పడిపోతాయి. చివరికి పుష్ప క్యారెక్టర్ ను కూడా అతడు ఓ డాన్ గా ఎలా ఎదుగుతున్నాడనే అంశం కోసం వాడుకున్నారు తప్ప, ఆ పాత్రను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేకపోయారు. దీంతో సెకండాఫ్ లో జోరు తగ్గింది. దీనికితోడు 3 గంటల నిడివి, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

ఇవన్నీ ఒకెత్తయితే.. అత్యంత కీలకమైన ప్రీ-క్లైమాక్స్ మరో ఎత్తు. హీరో-విలన్ మధ్య సంఘర్షణనను ఈసారి సుకుమార్ బలంగా చూపించలేకపోయాడు. పుష్ప సినిమాకు అదో మైనస్ గా మారింది. ఆ సంఘర్షణ బలంగా లేకపోవడంతో, క్లైమాక్స్ తేలిపోయింది. దీనికితోడు పుష్ప పార్ట్-2 కోసం అన్నట్టుగా క్లైమాక్స్ ను ముగించడం కూడా ప్రేక్షకుడికి నచ్చదు. కేజీఎఫ్, బాహుబలి విషయంలో అలా జరగలేదు. అందుకే అవి అంత హిట్టయ్యాయి, పార్ట్-2పై అంచనాలు పెంచగలిగాయి. పుష్ప మాత్రం అలాంటి ముగింపు ఇవ్వకుండానే, పార్ట్-2 కోసం ముగించినట్టుంది.

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడికి ఈ సినిమాతో అవార్డులొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 3 గంటల పాటు ప్రేక్షకుడు సీట్లో కూర్చున్నాడంటే దానికి కారణం బన్నీ. ఇక రష్మిక కూడా బాగానే మెప్పించింది. సునీల్, శత్రు, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కొత్త గెటప్పుల్లో కనిపించారు తప్ప, కొత్తదనం చూపించలేకపోయారు. ఫహాద్ ఫాజిల్ కనిపించింది 15 నిమిషాలే అయినప్పటికీ కుమ్మేశాడు. సెకెండాఫ్ లో అతడి విశ్వరూపం చూడొచ్చు మనం.

టెక్నికల్ గా చూసుకుంటే.. ముందుగా దేవిశ్రీప్రసాద్ తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బన్నీ-సుక్కూ-దేవిశ్రీ కాంబినేషన్ క ఉన్న క్రేజ్ అలాంటిది. ఆ క్రేజ్ ను నిలబెడుతూ.. మంచి సాంగ్స్ అయితే ఇచ్చాడు కానీ, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అందించలేకపోయాడు డీఎస్పీ. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్ ఎఫెక్టులు సరిగ్గా లేవు. తొందరగా చుట్టేసినట్టున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.

ఓవరాల్ గా పుష్ప సినిమాను అల్లు అర్జున్ నటవిశ్వరూపం కోసం ఓసారి చూడొచ్చు. సెకెండాఫ్ లో స్లోగా సాగే కథనం, 3 గంటల రన్ టైమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఈ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు.

First Published:  17 Dec 2021 10:57 PM GMT
Next Story