Telugu Global
International

ఒమిక్రాన్ తో తొలి మరణం.. బ్రిటన్ లో కలకలం..

ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, అంతే కాని అదేమంత ప్రమాదకరం కాదనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ తో బ్రిటన్ లో తొలి మరణం నమోదు కావడంతో అక్కడ కలకలం రేగింది. యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ధృవీకరించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారీ అలలా ముంచుకొస్తోందంటూ ప్రధాని ఇటీవలే హెచ్చరించారు. అంతలోనే తొలి మరణంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రజలంతా మరింత […]

ఒమిక్రాన్ తో తొలి మరణం.. బ్రిటన్ లో కలకలం..
X

ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, అంతే కాని అదేమంత ప్రమాదకరం కాదనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ తో బ్రిటన్ లో తొలి మరణం నమోదు కావడంతో అక్కడ కలకలం రేగింది. యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ధృవీకరించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారీ అలలా ముంచుకొస్తోందంటూ ప్రధాని ఇటీవలే హెచ్చరించారు. అంతలోనే తొలి మరణంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు ఒమిక్రాన్ భయంతో యూకేలో బూస్టర్ డోస్ పంపిణీ కూడా మొదలు పెట్టారు. డెల్టా కంటే ఇది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రెండు మూడు రోజులకు బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు రెట్టింపవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1239 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 3100కి చేరింది. యూకేలో తొలిసారిగా నవంబర్‌ 27న ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది. అప్పటినుంచే ప్రధాని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బూస్టర్ డోస్ పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశాలిచ్చారు.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ లో కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే డెల్టా కంటే ఇది ప్రమాదకారి కాదు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ మరణాలు లేకపోవడంతో పెద్దగా భయాందోళనలు లేవు. అయితే బ్రిటన్ లో మాత్రం కేసుల సంఖ్య భారీగా పెరగడం మాత్రం విశేషం. ఇప్పుడు బ్రిటన్ లోనే తొలి మరణం వెలుగు చూడటంతో ఇతర దేశాల్లో కూడా భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. విదేశాలనుంచి వచ్చిన ప్రయాణికులందరికీ భారత్ లో ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు చేస్తున్నారు. క్వారంటైన్ కి పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడితే మాత్రం వారితో కాంటాక్ట్ లోకి వచ్చినవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ భారత్ సహా ఇతర దేశాల్లో కూడా ఒమిక్రాన్ భయాలు పెద్దగా లేవు కానీ, బ్రిటన్ లో తొలిమరణం నమోదు కావడంతో కలకలం రేగింది.

First Published:  13 Dec 2021 10:50 AM GMT
Next Story