మహిళల సంపాదన.. భారత్ లో మరీ దారుణం..
ఆకాశంలో సగం, ఆత్మీయతలో సగం.. అసలు మహిళ లేకపోతే ప్రపంచమే లేదంటూ చాలామంది చాలా వ్యాఖ్యానాలే చేస్తుంటారు. అందులోనూ భారత దేశంలో మహిళల గురించి, మహిళాభ్యుదయం గురించి మాట్లాడని రాజకీయ నాయకుడంటూ ఎవరూ ఉండరు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక కోటా ఉంది, చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్లున్నాయి. స్థానిక సంస్థల్లో ఏకంగా 50శాతం వాటా ఇచ్చేశారు. ఇక వివిధ రంగాల్లో రోజు రోజుకీ మహిళల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతోందనే వార్తలు వింటున్నాం. సాయుధ బలగాలలో అన్నిరకాల విధులకు […]
BY sarvi11 Dec 2021 8:42 PM GMT
X
sarvi Updated On: 11 Dec 2021 8:44 PM GMT
ఆకాశంలో సగం, ఆత్మీయతలో సగం.. అసలు మహిళ లేకపోతే ప్రపంచమే లేదంటూ చాలామంది చాలా వ్యాఖ్యానాలే చేస్తుంటారు. అందులోనూ భారత దేశంలో మహిళల గురించి, మహిళాభ్యుదయం గురించి మాట్లాడని రాజకీయ నాయకుడంటూ ఎవరూ ఉండరు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక కోటా ఉంది, చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్లున్నాయి. స్థానిక సంస్థల్లో ఏకంగా 50శాతం వాటా ఇచ్చేశారు. ఇక వివిధ రంగాల్లో రోజు రోజుకీ మహిళల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతోందనే వార్తలు వింటున్నాం. సాయుధ బలగాలలో అన్నిరకాల విధులకు మహిళలకు అవకాశం కల్పించే విషయంలో భారత్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా కేవలం మాటలకే పరిమితం. భారత్ లో మహిళల వాస్తవ పరిస్థితి ఎలా ఉందనే విషయం అప్పుడప్పుడు సర్వేలతో బయటపడుతోంది. భారత్ లో పురుషుల సంపాదన, మహిళల ఆదాయానికి మధ్య ఉన్న అంతరం మరీ దారుణం. భారత్ లో మహిళల సంపాదన కేవలం 18.3 శాతం.
పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలున్నాయని చెప్పుకునే భారత్ లో మహిళలంటే ఎంత చిన్న చూపో ఈ సర్వే నిగ్గుతేల్చింది. కేవలం భారత్ లోనే కాదు, అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా ఈ అంతరం ఉంది. అయితే కనీసం శ్రీలంక, నేపాల్ తో కూడా ఈ విషయంలో భారత్ పోటీపడలేకపోవడం మాత్రం కలవరపెట్టే అంశం.
ఆఫ్ఘన్ లో అథమం.. మాల్డోవాలో ఘనం..
అందరూ ఊహించినట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ ఈ లిస్ట్ లో అట్టడుగు స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ ఆదాయంలో మహిళల సంపాదన కేవలం 4.2 శాతం మాత్రమే. పాకిస్తాన్ లో కూడా ఈ వివక్ష దారుణంగా ఉంది. అక్కడ మహిళల ఆదాయం కేవలం 7.4 శాతం. బంగ్లాదేశ్, భూటాన్ కూడా చివరి వరుసలో ఉన్నాయి. ఇక భారత్ కూడా అట్టడుగు స్థానంలో ఉండటమే ఇక్కడ విశేషం. మహిళల ఆదాయం విషయంలో భారత్ కంటే నేపాల్ (23.2), శ్రీలంక (23.3), చైనా (33.4) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలో మహిళల ఆదాయం పురుషులతో పోటీపడేది తూర్పు యూరప్ దేశాల్లో మాత్రమే. యూరప్ లోని కొన్ని దేశాల్లో మహిళల సగటు ఆదాయం 41శాతం పైనే ఉంది. మాల్డోవా అనే యూరప్ దేశంలో మహిళల ఆదాయం అత్యథికంగా 45శాతం ఉంది. కరోనా కష్టకాలంలో చాలా చోట్ల మహిళలు ఎక్కువగా ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో తారతమ్యాలు మరింత ఎక్కువగా ఉన్నాయని జెండర్ ఇన్ ఈక్వాలిటీ ఇన్ గ్లోబల్ ఎర్నింగ్స్ నివేదిక బయటపెట్టింది. అయితే భారత్ లో కుటుంబ వ్యవహారాల్లో మహిళలు చేసే పనులు వెలకట్టలేవని, వాటిని కూడా ఆదాయ మార్గాలుగా పరిగణిస్తే భారత్ లో మహిళల సత్తా తెలుస్తుందనేవారు కూడా ఉన్నారు. కానీ మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే భారత్ లో మాత్రం పురుషుల సంపాదన 82శాతం.. మహిళల ఆదాయం కేవలం 18శాతం అనేది ఆశ్చర్యకరమైన విషయం.
Next Story