Telugu Global
National

ఇకపై 18 ఏళ్లు దాటినవారికే సిగరెట్లు..

మద్యపానం, ధూమపానం అనే దుర్వ్యసనాలను మాన్పించేందుకు ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేస్తుంటాయి. మైనర్లకు సిగరెట్లు, మద్యం అమ్మడం శిక్షార్హం అనే నిబంధన ఉన్నా.. మన దేశంలో దీన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ న్యూజిలాండ్ లో మాత్రం కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. 2025నాటికి ధూమపానాన్ని 5 శాతానికే పరిమితం చేయాలని ఆ దేశ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మినా, మైనర్లు వాటిని కొనుగోలు చేసినా కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది. […]

ఇకపై 18 ఏళ్లు దాటినవారికే సిగరెట్లు..
X

మద్యపానం, ధూమపానం అనే దుర్వ్యసనాలను మాన్పించేందుకు ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేస్తుంటాయి. మైనర్లకు సిగరెట్లు, మద్యం అమ్మడం శిక్షార్హం అనే నిబంధన ఉన్నా.. మన దేశంలో దీన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ న్యూజిలాండ్ లో మాత్రం కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. 2025నాటికి ధూమపానాన్ని 5 శాతానికే పరిమితం చేయాలని ఆ దేశ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మినా, మైనర్లు వాటిని కొనుగోలు చేసినా కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.

14ఏళ్ల లోపువారికి శాశ్వత నిషేధం..
14ఏళ్ల లోపు ఉన్నవారెవరూ పొగాకు ఉత్పత్తులు కొనకూడదు, అలాంటి వారికి ఇతరులు అమ్మకూడదు. ఒకవేళ అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే ఇద్దరినీ కఠినంగా శిక్షిస్తారు. 14ఏళ్ల లోపువారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడంపై న్యూజిలాండ్ జీవిత కాల నిషేధం విధించింది. తాజాగా 18 ఏళ్ల లోపు వారికి కూడా పొగాకు ఉత్పత్తులను దూరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్మోకింగ్ కి కనీస వయసు 18 ఏళ్లుగా నిర్ణయించింది. ఇకపై ప్రతి ఏడాదీ ఈ కనీస వయసుని పెంచుకుంటూ పోతుంది. అలా పెంచుకుంటూ పోతూ.. శాశ్వతంగా ధూమపాన రహిత దేశంగా న్యూజిలాండ్ ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నికోటిన్ రహిత ఆహార పదార్థాలు..
ఆహార పదార్థాలు, కూల్ డ్రింకుల్లో కూడా నికోటిన్ ఉంటుంది. అయితే దాన్ని తక్కువమోతాదులో వినియోగిస్తుంటారు. కొన్ని చోట్ల మోతాదు ఎక్కువగా ఉన్నా.. ప్యాకింగ్ లో ఆ విషయాలు చూపించరు. ఇలాంటి ఉత్పత్తులపై కూడా న్యూజిలాండ్ ఉక్కుపాదం మోపింది. నికోటిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న ఉత్పత్తులనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులను అమ్మే దుకాణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గించబోతున్నారు.

ధూమపాన రహిత దేశంగా..
న్యూజిలాండ్ ని ధూమపాన రహిత దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెబుతున్నారు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ఆయేషా వెరాల్‌. కరోనా వైరస్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, నికోటిన్ వల్ల అంతకు మించి ప్రమాదం ఉందని, అయితే ఆ ముప్పు మెల్ల మెల్లగా పెరుగుతుందని చెప్పారు. అందుకే న్యూజిలాండ్ లో పొగాకు ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు.

First Published:  9 Dec 2021 10:03 PM GMT
Next Story