Telugu Global
National

బీహార్ లిస్ట్ లో మోదీ, ఐశ్వర్య, ప్రియాంక.. టీకా లెక్కలన్నీ తప్పుల తడక

బీహార్ లో 8కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్న మరుసటి రోజే అసలు విషయాలు బయటకొచ్చాయి. బీహార్ కోటాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కి కూడా టీకాలు వేశారట అధికారులు. అక్కడి టీకా లెక్కల్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి. అక్కడితో ఆ లిస్ట్ ఆగలేదు. అమిత్ షా, ప్రియాంక చోప్రా.. పేర్లు కూడా అందులో కనపడతాయి. బీహార్ లోని అర్వాల్ జిల్లా కర్పి పంచాయతీ పరిధిలో వీరికి […]

బీహార్ లిస్ట్ లో మోదీ, ఐశ్వర్య, ప్రియాంక.. టీకా లెక్కలన్నీ తప్పుల తడక
X

బీహార్ లో 8కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్న మరుసటి రోజే అసలు విషయాలు బయటకొచ్చాయి. బీహార్ కోటాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కి కూడా టీకాలు వేశారట అధికారులు. అక్కడి టీకా లెక్కల్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి. అక్కడితో ఆ లిస్ట్ ఆగలేదు. అమిత్ షా, ప్రియాంక చోప్రా.. పేర్లు కూడా అందులో కనపడతాయి. బీహార్ లోని అర్వాల్ జిల్లా కర్పి పంచాయతీ పరిధిలో వీరికి టీకాలు వేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే వీరంతా నిజంగానే బీహార్ లో టీకాలు వేయించుకున్నారా. లేక వారి పేరుతో ఇంకెవరైనా ఉన్నారా..? లేక అవన్నీ బోగస్ రికార్డులా..? అనే విషయంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేశారు కూడా. అయితే సస్పెండ్ అయిన వైద్య సిబ్బంది మాత్రం, ఈ విషయంలో తమని బలిపశువులుగా మార్చారని కేవలం డేటా ఎంట్రీ వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు.

మోదీ పుట్టినరోజుతో మొదలైన తంటా..
సెప్టెంబర్-17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. అలా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి. అందులో బీహార్ వాటా 33లక్షలు. టార్గెట్ పెట్టి మరీ టీకాలు ఇవ్వాలంటూ సిబ్బందిని ఇబ్బంది పెట్టారు. దీంతో వారు నోటికొచ్చిన పేర్లన్నీ లిస్ట్ లో రాసేసుకున్నారు. సింగిల్ డోస్ టీకా తీసుకున్న తర్వాత కొవిన్ యాప్ లో వివరాలు చూసుకుంటే.. రెండు డోసులు తీసుకున్నట్టు చూపిస్తోందనే ఫిర్యాదులు బీహార్ లో ఎక్కువగా వస్తున్నాయి.

తమిళనాడులో కూడా ఇంతే..
తమిళనాడులో కూడా అధికారులు టార్గెట్ ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీకాలు తీసుకోడానికి ఎవరూ మందుకు రాకపోయినా ఫేక్ ఎంట్రీస్ తో రికార్డులు నింపుతున్నారు. రోజు వారీ టార్గెట్లు పూర్తయినట్టు పై అధికారులకు నివేదికలు పంపుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాటిని పరిశీలిస్తే వాస్తవంగా టీకా తీసుకున్నవారి సంఖ్య, నివేదికల్లో ఉన్నవారి సంఖ్యకు చాలా తేడా ఉంటోంది.

తమిళనాడులో అసలు వ్యాక్సిన్ వేయించుకోనివారి మొబైల్ నెంబర్లకి కూడా రెండు డోసులు తీసుకున్నట్టు మెసేజ్ లు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయినవారి మొబైల్ నెంబర్లకి కూడా టీకా వేయించుకున్నట్టు సందేశాలు వస్తున్నాయి. కొందరికయితే వేర్వేరు పేర్లతో ఐదారు సార్లు కూడా మెసేజ్ లు రావడం విశేషం. ఇవన్నీ ఫేక్ ఎంట్రీస్ అని తేలినా.. అధికారిక లెక్కల్లో మాత్రం ఇవి సరైనవే.

తమిళనాడులో ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజువారీ 250 వ్యాక్సిన్ డోసులు వేయాలనే టార్గెట్ ఉంది. కానీ అక్కడ పరిస్థితుల ప్రకారం కేవలం 70నుంచి 80 డోసులు మాత్రమే వేయగలరు. ఇలాంటి చోట్ల స్థానికులనుంచి గుర్తింపు కార్డులు సేకరించి, వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వైద్య సిబ్బంది తప్పుడు లెక్కలు రాసుకుంటున్నారు. లేదా ప్రైవేట్ సంస్థల వద్ద ఫోన్ నెంబర్లు సేకరించి నోటికొచ్చిన పేర్లు, ఆధార్ నెంబర్లు ఎంట్రీ చేస్తున్నారు. దీంతో కొన్ని ఫోన్ నెంబర్లకి వరుసబెట్టి మెసేజ్ లు వస్తున్నాయి.

100కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయిన సందర్భంగా ఆమధ్య అంతర్జాతీయ సమాజం భారత్ ని మెచ్చుకుంది. భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం భలే జోరుగా సాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర దేశాల ప్రభుత్వాలు అభినందించాయి. ప్రభుత్వ పనితీరుని ప్రశంసించాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు భారత్ లో 128కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని వినియోగించారు. 47.7కోట్ల మందికి రెండు డోసులు వేశారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు మాత్రమే. వాస్తవాలు చూస్తే మాత్రం ఇందులో డబుల్ ఎంట్రీలు చాలానే కనిపిస్తాయి. ప్రముఖులకు వివిధ దేశాలు గౌరవ పౌరసత్వాలు ప్రకటించినట్టు.. బీహార్ లాంటి రాష్ట్రాలు మోదీ, అమిత్ షా, అమితాబ్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులను తమ వ్యాక్సినేషన్ లిస్ట్ లో చేర్చుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ గురించి కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నా.. వాస్తవంలో అదంతా తప్పుల తడక అని తేలుతోంది.

First Published:  6 Dec 2021 9:18 PM GMT
Next Story