Telugu Global
National

తల్లిదండ్రులు టీకాలు వేసుకుంటేనే పిల్లలకు స్కూల్ లో ఎంట్రీ..

ఒమిక్రాన్ భయంతో దేశవ్యాప్తంగా మళ్లీ కొత్త కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. భారత్ లో ఈ వేరియంట్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కర్నాటకలో అయితే సర్కారు మరింత అప్రమత్తంగా ఉంది. విదేశాలనుంచి వచ్చేవారికి వారం రోజులపాటు క్వారంటైన్ తప్పనిసరి అనే నిబంధనను కర్నాటక ఇప్పటికే కఠినంగా అమలు చేస్తోంది. విదేశాలనుంచి వచ్చేవారెవరూ ఎక్కడికీ తప్పించుకునిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అలాంటివారు కనీసం తమ మొబైల్ కూడా స్విచాఫ్ చేసుకోడానికి వీల్లేదని చెప్పింది. ఇక స్కూల్ కి వచ్చే […]

తల్లిదండ్రులు టీకాలు వేసుకుంటేనే పిల్లలకు స్కూల్ లో ఎంట్రీ..
X

ఒమిక్రాన్ భయంతో దేశవ్యాప్తంగా మళ్లీ కొత్త కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. భారత్ లో ఈ వేరియంట్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కర్నాటకలో అయితే సర్కారు మరింత అప్రమత్తంగా ఉంది. విదేశాలనుంచి వచ్చేవారికి వారం రోజులపాటు క్వారంటైన్ తప్పనిసరి అనే నిబంధనను కర్నాటక ఇప్పటికే కఠినంగా అమలు చేస్తోంది. విదేశాలనుంచి వచ్చేవారెవరూ ఎక్కడికీ తప్పించుకునిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అలాంటివారు కనీసం తమ మొబైల్ కూడా స్విచాఫ్ చేసుకోడానికి వీల్లేదని చెప్పింది. ఇక స్కూల్ కి వచ్చే పిల్లల విషయంలో కూడా కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. తల్లిదండ్రులిద్దరూ రెండు డోసుల టీకాలు తీసుకుంటేనే వారి పిల్లలకు స్కూల్ లో ఎంట్రీ, లేకపోతే లేదు. సినిమా థియేటర్లు, మాల్స్ కి వెళ్లాలంటే మాస్క్ తో పాటు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలన్నా, కనీసం రోడ్లపైకి రావాలన్నా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది కర్నాటక ప్రభుత్వం.

దక్షిణాఫ్రికా వ్యక్తిపై కేసు నమోదు..
దక్షిణాఫ్రికానుంచి వచ్చి క్వారంటైన్లో ఉండాల్సిన ఓ వ్యక్తి.. ప్రైవేట్ ల్యాబ్ లో కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ని అక్రమంగా సంపాదించి దాని ఆధారంగా స్థానికంగా ఓ సమావేశంలో పాల్గొని, అనంతరం దుబాయ్ కి అక్కడినుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడు. ఈలోగా అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని రిపోర్ట్ లు వచ్చాయి. దీంతో అధికారులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతను బస చేసిన హోటల్, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్ పై కూడా కేసు పెట్టారు. విదేశాలనుంచి వచ్చేవారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. వారం రోజుల క్వారంటైన్ పూర్తి కాకుండా హోటల్ రూమ్ నుంచి కదలడం శిక్షార్హం అని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ అలర్ట్..
ఇప్పటికే తెలంగాణలో మాస్క్ నిబంధన తప్పనిసరి చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఏపీలో కూడా విదేశాలనుంచి వచ్చినవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు వైద్య సిబ్బంది. విదేశీ ప్రయాణికులు వారి ఇళ్లలోనే వారం రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు అధికారులు. ప్రస్తుతం ఏపీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో దిగి, నేరుగా ఏపీకి వచ్చేవారిపై నిఘా పెట్టారు.

తిరుపతి స్విమ్స్ లో ఒమిక్రాన్ పరీక్షలకు ఏర్పాట్లు..
మరోవైపు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఒమిక్రాన్ వేరియంట్ ని గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమిక్రాన్ ని గుర్తించాలంటే డీఎన్ఏ పరిశీలించాలి. డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేసేందుకు అవసరమైన శాంజర్ సీక్వెన్సింగ్ యంత్రాన్ని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. దీనిపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ పరీక్షలు ఏపీలో జరగలేదని, తొలిసారిగా స్విమ్స్ లో ఈ పరీక్షలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు అధికారులు.

First Published:  3 Dec 2021 9:57 PM GMT
Next Story