Telugu Global
National

కాంగ్రెస్, టీఎంసీ.. డైరెక్ట్ ఫైట్ మొదలు..

బీజేపీ అంతం మా ఇద్దరి పంతం అంటూ ఆమధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ పశ్చిమబెంగాల్ లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం తర్వాత మమత ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. బీజేపీని ఎదుర్కోడానికి కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరం లేదని, అసలు కాంగ్రెస్సే అవసరం లేదని అంటున్నారామె. యూపీఏనా.. అదెక్కడుంది..? అని ప్రశ్నించి తీవ్ర కలకలం రేపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో స్పందించాయి. […]

కాంగ్రెస్, టీఎంసీ.. డైరెక్ట్ ఫైట్ మొదలు..
X

బీజేపీ అంతం మా ఇద్దరి పంతం అంటూ ఆమధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ పశ్చిమబెంగాల్ లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం తర్వాత మమత ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. బీజేపీని ఎదుర్కోడానికి కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరం లేదని, అసలు కాంగ్రెస్సే అవసరం లేదని అంటున్నారామె. యూపీఏనా.. అదెక్కడుంది..? అని ప్రశ్నించి తీవ్ర కలకలం రేపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో స్పందించాయి. బెంగాల్ విజయంతో మమత అతివిశ్వాసంతో ఉన్నారని, బెంగాల్ అంటే భారత్, భారత్ అంటే బెంగాల్ కాదని ఆమె గ్రహించాలని హితవు పలికారు కాంగ్రెస్ నేతలు. 2012లో యూపీఏ ప్రభుత్వానికి ఆరుగురు టీఎంసీ ఎంపీలు మద్దతిచ్చారని, అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర మమత చేశారని ఆరోపించారు లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి. ఆమె మోదీతో చేతులు కలిపారని, కాంగ్రెస్ ను బలహీనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. జలై 28, 2021న మమతా బెనర్జీ, సోనియా గాంధీని కలిశారని, ఆ తర్వాత ఆమెకు ఈడీ నోటీసులిచ్చిందని, ఆ తర్వాతే పరిణామాలన్నీ మారిపోయాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

రాహుల్ కేంద్రంగా విమర్శలు..
మరోవైపు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శల డోసు పెంచడం కీలక పరిణామం. రాజకీయాల్లో నిరంతర ప్రయత్నం తప్పనిసరని, ఎక్కువ సమయం విదేశాల్లో ఉండకూడదంటూ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల్లో మమతకు బ్యాక్ బోన్ గా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి, ఆ సమీకరణాలు ఫలించకపోవడంతో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ కీలకమే కానీ, గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైందని అన్నారు పీకే. ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే ఉన్న దైవిక హక్కు కాదనే విషయం గుర్తించాలన్నారు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందామంటూ పరోక్షంగా రాహుల్ సామర్థ్యాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ చేస్తున్న విమర్శల వెనక మమతా బెనర్జీ ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మేఘాలయలో కాంగ్రెస్ కనుమరుగు..
కాంగ్రెస్ ని టార్గెట్ చేసిన మమతా బెనర్జీ.. ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీనుంచి వలసలను భారీగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే మేఘాలయలో 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12మంది టీఎంసీలోకి ఫిరాయించారు. సాక్షాత్తూ ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేమ్స్ లింగ్డో, మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మాన‌స్ దాస్ గుప్తా.. తాజాగా టీఎంసీ కండువా కప్పుకోవడం మరో పెద్ద షాక్. మొత్తమ్మీద మేఘాలతో కాంగ్రెస్ ని నిర్వీర్యం చేస్తున్నారు మమత. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న తరుణంలో గోవాలో కూడా వలసలను ప్రోత్సహించి కాంగ్రెస్ కి నష్టం చేకూరుస్తున్నారు. మొత్తమ్మీద.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో మమతా బెనర్జీ డైరెక్ట్ ఫైట్ కి దిగారు. కాంగ్రెస్ పై ముప్పేట దాడి కొనసాగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి హవా తగ్గిపోతుందనుకుంటున్న వేళ, ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కే అవకాశం ఉందనుకుంటున్న వేళ, మమతా బెనర్జీ.. హస్తం పార్టీని హడలెత్తిస్తున్నారు.

First Published:  2 Dec 2021 9:09 PM GMT
Next Story