Telugu Global
National

ఒమిక్రాన్ ఎఫెక్ట్: విమాన సర్వీసుల పునరుద్ధరణపై కేంద్రం వెనకడుగు..

అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈనెల 15నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వెనకడుగు వేసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అంతర్జాతీయ ప్రయాణాలకు పచ్చ జెండా ఊపితే కోరి ముప్పు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆధ్వర్యంలో 31 దేశాలకు మాత్రమే, అదీ పరిమితంగానే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ముప్పు ఉన్న […]

ఒమిక్రాన్ ఎఫెక్ట్: విమాన సర్వీసుల పునరుద్ధరణపై కేంద్రం వెనకడుగు..
X

అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈనెల 15నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వెనకడుగు వేసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అంతర్జాతీయ ప్రయాణాలకు పచ్చ జెండా ఊపితే కోరి ముప్పు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆధ్వర్యంలో 31 దేశాలకు మాత్రమే, అదీ పరిమితంగానే విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ముప్పు ఉన్న దేశాలతో జాగ్రత్త..
దక్షిణాఫ్రికా, బ్రిటన్ సహా మరికొన్ని దేశాలనుంచి నేరుగా విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో నిషేధించింది కేంద్రం. మరికొన్ని దేశాలను ఎట్-రిస్క్ (ముప్పు) జాబితాలో చేర్చింది. ఇలాంటి దేశాలనుంచి వచ్చేవారికి కచ్చితంగా ఎయిర్ పోర్ట్ లోనే కొవిడ్ పరీక్షలు చేస్తారు, క్వారంటైన్ తప్పనిసరి చేస్తారు. ముప్పులేని దేశాలనుంచి వచ్చేవారికి సైతం అనుమానం ఉంటే కొవిడ్ పరీక్షలు చేసి, ఆ తర్వాతే వారిని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు అనుమతిస్తారు. ముప్పు ఉన్న దేశాలకు చెందినవారు కొంతమంది రూటు మార్చుకుని వేరే దేశం ద్వారా భారత్ లో ప్రవేశించాలనుకోవడం సరికాదని, అలాంటి వారిపై నిఘా పెట్టామని చెబుతున్నారు అధికారులు.

ప్రయాణాలపై నిషేధంతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వస్తుందా..?
2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ తొలిసారిగా నిలిపివేసింది. అయితే అప్పటికే భారత్ కి ముప్పు తీవ్రమైంది. ఓ దశలో అంతర్జాతీయ ప్రయాణాల నిషేధంపై భారత్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని, అందుకే కరోనా వ్యాప్తి మన దేశంలో ఎక్కువైందనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత దేశీయంగా ఆంక్షలు తెరపైకి తేవడంలో కేంద్రం పెద్దగా ఆలోచించలేదు. కరోనా కట్టడికోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో కూడా ముందుగానే మేల్కొన్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ఒమిక్రాన్ తో ముంచుకొస్తుందన్న వార్త నేపథ్యంలో భారత్ మరింత ముందుగా అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగిస్తోంది. అయితే ఇలాంటి నిషేధాలతో కరోనా వ్యాప్తిని అడ్డుకోలేరని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). అంతర్జాతీయ ప్రయాణాలపై భారత్ నిషేధం కొనసాగించడాన్ని WHO స్వాగతించలేదు. ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకుని ప్రపంచ దేశాలు విమాన సర్వీసుల్ని నిలిపివేయడం సరికాదన్నారు WHO అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్.

విస్తరిస్తున్న ఒమిక్రాన్..
యూరోపియన్‌ యూనియన్‌ లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ వ్యాపించిన దేశాల సంఖ్య 20కు చేరింది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్టు ఆదేశ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

First Published:  1 Dec 2021 9:02 PM GMT
Next Story