Telugu Global
Cinema & Entertainment

అఖండ మూవీ రివ్యూ

నటీనటులు: బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, పూర్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, నితిన్ మెహతా తదితరులు సినిమాటోగ్రఫీ : సి. రాంప్రసాద్‌ సంగీతం : త‌మన్‌ ఎస్‌‌‌ మాటలు : ఎం.రత్నం ఎడిటింగ్‌ : కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు నిర్మాత : మిర్యాల రవీందర్‌రెడ్డి రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను రేటింగ్: 2.25/5 ఓ పెద్ద హీరోను పెట్టి డ్యూయల్ రోల్ చేయిస్తున్నప్పుడు దర్శకుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త ఏంటి? ఒకే హీరో చేస్తున్న 2 పాత్రల్లో ఏ […]

అఖండ మూవీ రివ్యూ
X

నటీనటులు: బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, పూర్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, నితిన్ మెహతా తదితరులు
సినిమాటోగ్రఫీ : సి. రాంప్రసాద్‌
సంగీతం : త‌మన్‌ ఎస్‌‌‌
మాటలు : ఎం.రత్నం
ఎడిటింగ్‌ : కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు
నిర్మాత : మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను
రేటింగ్: 2.25/5

ఓ పెద్ద హీరోను పెట్టి డ్యూయల్ రోల్ చేయిస్తున్నప్పుడు దర్శకుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త ఏంటి? ఒకే హీరో చేస్తున్న 2 పాత్రల్లో ఏ ఒక్కటి తగ్గకూడదు. రెండు పాత్రలు సమానంగా ఉండాలి. ఆ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించేలా చేయాలి. ఇద్దరి మధ్య ఎమోషన్ పండించాలి. ఈ బేసిక్ విషయాన్ని బోయపాటి వదిలేశారు. అఖండ సినిమాలో ఇద్దరు బాలయ్యలను చూపించిన ఈ దర్శకుడు.. సెకండాఫ్ వచ్చేసరికి మొదటి బాలయ్యను గాలికొదిలేశాడు. ఎంతలా అంటే, రెండో భాగంలో మొదటి బాలయ్యతో ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేకపోయాడు. గట్టిగా ఓ ఫైట్ కూడా చేయించలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే, మరో బాలయ్యతో మొదటి బాలయ్యను ఫేస్ టు ఫేస్ చూపించలేకపోయాడు. అఖండ సినిమా నెరేషన్ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి.

ఈ సినిమా కథ చాలా సింపుల్. అనంతపురంలో ఓ పెద్దాయనకు కవలలు జన్మిస్తారు. వాళ్లే మురళీకృష్ణ, అఖండ. వీళ్లలో అఖండ కారణ జన్ముడు. ఓ పీఠాధిపతిని హత్యచేసి, అతడి స్థానంలో దొంగ స్వామీజీగా కొనసాగుతున్న గజేంద్ర (నితిన్ మెహతా)ను అంతమొందించడానికే దైవాంశతో పుడతాడు అఖండ. గజేంద్ర, తన తమ్ముడు వరదరాజులు (శ్రీకాంత్)తో అనేక దుర్మార్గులు చేయిస్తుంటాడు. వీళ్లందర్నీ అఖండ హతమారుస్తాడు. ప్రకృతిని, ప్రజల్ని కాపాడతాడు. ఇదే స్టోరీ.

సినిమాలో మురళీకృష్ణ, అఖండ అనే రెండు పాత్రల్లో బాలయ్యను చూపించాడు బోయపాటి. ఆ రెండు పాత్రలకు సంబంధం లేదనుకుంటే పొరపాటు. ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు. పైగా కవలలు. కానీ బోయపాటి ఆ ఇద్దర్నీ కలిపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య డైలాగులు కూడా పెట్టలేదు. మొదటిభాగాన్ని మురళీకృష్ణ ఎలివేషన్స్ కోసం వాడుకున్న దర్శకుడు, రెండో భాగాన్ని అఖండ ఎలివేషన్స్ కోసం వాడుకున్నాడు. ఈ హడావుడిలో ఎమోషన్స్ ను, క్యారెక్టర్స్ మధ్య సెంటిమెంట్స్ ను పట్టించుకోకపోవడం అఖండలో పెద్ద మైనస్.

ఈ మైనస్ పాయింట్స్ మొత్తాన్ని రక్తసిక్తమైన ఫైట్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చూడగా చూడగా ఆ ఫైట్స్ కూడా రిపీట్ అయినట్టు కనిపించాయి తప్ప, కొత్తదనం లేదు. సినిమా సాగుతున్న కొద్దీ ఓ దశలో ప్రేక్షకుడికి ఏం అనిపిస్తుందంటే.. ఫైట్స్ కోసం ఈ సినిమా తీశారా.. లేక సినిమాను ఫైట్స్ మధ్య ఇరికించారా అనే అనుమానం కలుగుతుంది. 167 నిమిషాల సినిమాలో హీరో ఎలివేషన్స్, ఫైట్స్ కే 80శాతం సమయం కేటాయించారంటే ఆశ్చర్యం కలగకమానదు.

బాలయ్యను ఓ కొత్త గెటప్ లో చూపించాలి, అరివీర భయంకరంగా ఫైట్స్ చేయించాలి, నందమూరి ఫ్యాన్స్ ను తృప్తి పరచాలి. బోయపాటి ఇదే ఎజెండాతో సినిమా తీసినట్టున్నాడు. ఆ విషయంలో అతడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అఘోరగా బాలయ్య మెప్పించాడు. అతడి లుక్, ఫైట్స్, యాక్షన్ అన్నీ బాగున్నాయి. ఫ్యాన్స్ ఈలలు వేసి, గోల చేసే మూమెంట్స్ అన్నీ అఘోర చుట్టూనే ఉన్నాయి. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కు పెద్దగా సీన్ ఇవ్వలేదు. ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. అయితే ఈ పాత్రను సింపుల్ గా కూడా చూపించొచ్చు. దీని కోసం ఐఏఎస్ ఆఫీసర్ అనే క్యారెక్టర్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తన సినిమాల్లో హీరోయిన్ పాత్రల్ని పెద్ద పెద్ద హోదాల్లో చూపించడం ఆనవాయితీగా పెట్టుకున్నట్టున్నాడు బోయపాటి. అంతకుమించి ప్రగ్యా పాత్రకు, ఐఏఎస్ ట్యాగ్ కు పెద్ద లింక్-సింక్ కనిపించదు.

పూర్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, నితిన్ మెహతా, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ తమ పాత్రలకు తగ్గట్టు, బోయపాటి చెప్పినట్టు లౌడ్ గా నటించారు. కొన్ని పాత్రల్ని అసలు ఎందుకు పెట్టాడో బోయపాటికే తెలియాలి. తెర నిండా ఆర్టిస్టులు కనిపించాలనే కోరిక కాబోలు. టెక్నికల్ గా చూసుకుంటే ఫస్ట్ క్రెడిట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి, ఫైటర్స్ కే ఇవ్వాలి. సినిమా మొత్తం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్, వాళ్ల టీమ్ అంతా కష్టపడి చేసిన ఫైట్స్ మాత్రమే కనిపించాయి. వాళ్ల హార్డ్ వర్క్ తెరపై కనిపించింది. తర్వాత క్రెడిట్ తమన్ కు ఇవ్వాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు 2 పాటలు బాగా ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల అఖండ సినిమాను ఆమాత్రమైనా చూడగలిగాం. ఇక రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. యాక్షన్ సన్నివేశాల్లో అతడి కెమెరా పనితనం బాగా కనిపించింది.

ఓవరాల్ గా అఖండ సినిమా పూర్తిగా బాలయ్య అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఊర మాస్ యాక్షన్ సన్నివేశాలు కోరుకునే జనాలు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా పక్కనపెట్టొచ్చు.

Next Story