Telugu Global
National

పదే పదే ఇండోర్ కే పట్టం కడుతున్నారెందుకు..?

స్వచ్ఛ సర్వేక్షణ్ -2021 ర్యాంకుల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇదేం కొత్త కాదు, గత ఐదేళ్లుగా ఇండోర్ ఆ స్థానాన్ని పదిలపరుచుకోవడమే గొప్ప. అసలు ఇండోర్ అంత పరిశుభ్రంగా ఉంటుందా, రోడ్లపై చెత్త అస్సలు కనిపించదా, స్వచ్ఛమైన నగరంగా ప్రతి ఏడాదీ ఇండోర్ కి మొదటి స్థానం ఎందుకు దక్కుతోంది..? మధ్యప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఇండోర్ కి పేరుంది. భారత్ లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం రెండూ ఒకే చోట […]

పదే పదే ఇండోర్ కే పట్టం కడుతున్నారెందుకు..?
X

స్వచ్ఛ సర్వేక్షణ్ -2021 ర్యాంకుల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇదేం కొత్త కాదు, గత ఐదేళ్లుగా ఇండోర్ ఆ స్థానాన్ని పదిలపరుచుకోవడమే గొప్ప. అసలు ఇండోర్ అంత పరిశుభ్రంగా ఉంటుందా, రోడ్లపై చెత్త అస్సలు కనిపించదా, స్వచ్ఛమైన నగరంగా ప్రతి ఏడాదీ ఇండోర్ కి మొదటి స్థానం ఎందుకు దక్కుతోంది..?

మధ్యప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఇండోర్ కి పేరుంది. భారత్ లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం రెండూ ఒకే చోట ఉన్న ఏకైక నగరంగా ఇండోర్ కి ప్రత్యేకత ఉంది. సముద్ర మట్టానికి 553 అడుగుల ఎత్తులో ఉండటం కూడా శీతోష్ణస్థితి విషయంలో ఇండోర్ కి ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇండోర్ లో ఎంత పెద్ద వర్షం కురిసినా ఎక్కడా చుక్క నీరు నిలబడదు. భౌగోళిక స్థితితోపాటు, ఇండోర్ స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు వచ్చిన సత్ఫలితం ఇది. ఇండోర్ సగటు అక్షరాస్యత 87.38 శాతం.

చెత్త సేకరణ, చెత్త నిర్వహణ..
ఇక ఇండోర్ లో చెత్త సేకరణపై ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యథిక శ్రద్ధ పెట్టింది. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి ప్రతి రోజూ చెత్తబండి వచ్చినప్పుడు ఇచ్చే అలవాటు చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా ఈ కార్యక్రమం ఆగలేదు, ఏ ఒక్క ఇంటిని కూడా చెత్తబండి మిస్ చేయలేదు అని చెబుతారు అధికారులు. అలా సేకరించిన చెత్తను ఇంధనంగా మార్చేందుకు ఇక్కడ ప్లాంట్ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. గార్బేజ్ వ్యాన్ కమాండ్ సెంటర్ నుంచి చెత్త సేకరణ వాహనాలు ఎప్పుడు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తారు, ఏ వాహనం ఏ వీధికి వెళ్లలేదో కూడా వారి దగ్గర డేటా ఉంటుంది.

ప్రజల భాగస్వామ్యం గొప్పది..
మొదట్లో చెత్తను వేరు చేసివ్వమంటే ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ప్రభుత్వం కల్పించిన అవగాహనతో వారే తర్వాతి కాలంలో చెత్తను వేరు చేసి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా క్షేత్ర స్థాయిలోనే తడి పొడి చెత్తను వేరు చేయడంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ 95 శాతం అక్కడ విజయవంతంగా నడుస్తోంది. ఇండోర్ కి వచ్చిన స్వచ్ఛ అవార్డుకి ఇదే ప్రధాన కారణం.

రోడ్లన్నీ స్వచ్ఛంగా..
ఇండోర్ పట్టణంలో 800 కిలోమీటర్ల మేర ఉండే ప్రధాన రోడ్లన్నిటినీ రాత్రివేళ స్వెప్ట్ మెషిన్స్ తో శుభ్రపరుస్తారు. డివైడర్లను, ఫుట్ పాత్ లను కూడా శుభ్రపరుస్తారు. మురికినీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా వచ్చే నీటిని ఇందుకోసం వాడతారు. ఇలా శుభ్రపరిచే సమయంలో చెత్త వస్తే దాన్ని రోడ్డు పక్కనే కుప్పగా పడేయకుండా, ప్రత్యేకంగా సేకరించి అక్కడినుంచి తరలిస్తారు.

ప్రజల అవగాహనే ప్రధానం..
మొదట్లో స్వచ్ఛ అవార్డుకోసం ఈ పరిశుభ్రతను అలవాటు చేసుకున్నా.. ఆ తర్వాత అది ఇండోర్ ప్రజల జీవన విధానంలో ఓ భాగమైంది. ఇప్పుడు అధికారుల సూచనలు లేకపోయినా ప్రజలు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారు. ఇండోర్ అరుదైన గుర్తింపుని అలాగే కాపాడుకుంటున్నారు.

Next Story