Telugu Global
NEWS

ముంపు బారిన 3 జిల్లాలు.. బాధితులకు రూ.2వేలు తక్షణ సాయం..

భారీ వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో చెరువులు కట్టలు తెంచుకుని ఊళ్లమీద పడ్డాయి. జాతీయ రహదారులు సైతం కాలువలను తలపించాయి. రాజంపేటలో బస్సు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో కండక్టర్ సహా పలువురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతదేహాలకోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటు వేలాది ఇళ్లు నీటమునిగాయి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధిత కుటుంబానికి తక్షణం రూ.2వేలు ఆర్థిక సాయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వరదనీరు ఇంకేలోగా […]

ముంపు బారిన 3 జిల్లాలు.. బాధితులకు రూ.2వేలు తక్షణ సాయం..
X

భారీ వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో చెరువులు కట్టలు తెంచుకుని ఊళ్లమీద పడ్డాయి. జాతీయ రహదారులు సైతం కాలువలను తలపించాయి. రాజంపేటలో బస్సు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో కండక్టర్ సహా పలువురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతదేహాలకోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటు వేలాది ఇళ్లు నీటమునిగాయి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధిత కుటుంబానికి తక్షణం రూ.2వేలు ఆర్థిక సాయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వరదనీరు ఇంకేలోగా ఆ సాయం బాధితులకు అందాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వేలో పాల్గొంటారు.

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు కిందకు విడిచిపెట్టడంతో.. పెన్నా ఉగ్రరూపం దాల్చింది. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లలో బాధితులు కాలం గడుపుతున్నారు. చిత్తూరు జిల్లాలో 600 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుపతిలో మొత్తం 67 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడంతో.. దాని పరీవాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి.

ప్రధాని ఆరా..
ఏపీలో భారీ వర్షాలపై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్ కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని చెప్పారు. ముంపు ప్రాంతాల కుటుంబాలకు 2వేల రూపాయలు తక్షణ సాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

వాయుగుండం బలహీనం.. అయినా..!
శుక్రవారం ఉదయానికే వాయుగుండం తీరం దాటినా.. ఆ తర్వాతే అల్లకల్లోలం జరిగింది. అప్పటికే నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్ట్ లు, చెరువులు.. మరోసారి వర్షం కురవడంతో పొంగి పొర్లాయి. వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక మీదుగా అరేబియా సముద్రంవైపు దారి మళ్లించుకుంది. దీని ప్రభావంతో మరో 24గంటలసేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

First Published:  19 Nov 2021 8:34 PM GMT
Next Story