Telugu Global
National

ముదిరిన వివాదం.. బాయిల్డ్ రైస్ కొనలేమన్న కేంద్రం..

తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ప్రభుత్వం నిరసన దీక్షలతో పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన వేళ.. గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా ప్రకటన విడుదల చేసింది. అసలు బాయిల్డ్ రైస్ కొనేది లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పటివరకు బాయిల్డ్‌ రైస్‌ సేకరించామని, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని ప్రకటించింది. ఇకపై వరి, […]

ముదిరిన వివాదం.. బాయిల్డ్ రైస్ కొనలేమన్న కేంద్రం..
X

తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ప్రభుత్వం నిరసన దీక్షలతో పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన వేళ.. గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా ప్రకటన విడుదల చేసింది. అసలు బాయిల్డ్ రైస్ కొనేది లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పటివరకు బాయిల్డ్‌ రైస్‌ సేకరించామని, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని ప్రకటించింది. ఇకపై వరి, గోధుమ తక్కువగా పండించాలని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసే పరిస్థితి లేనందు వల్లే సేకరణ ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఎగుమతి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్రం చెప్పింది.

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి..
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా పండించాలని, రాష్ట్రాలు సేకరించగలిగేంత వరకే వరి పండించాలని సూచించింది. రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతే వచ్చే ఏడాది ధాన్యం, బియ్యం ఎంతమేర సేకరించాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రకటనపై తీవ్ర స్థాయిలో మండిపడింది. పంజాబ్‌ లో కోటి 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం తెలంగాణపై మాత్రం ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు నేతలు. వ్యవసాయ చట్టాల తయారీ, ధాన్యం సేకరణ, మార్కెటింగ్‌, ఎక్స్‌పోర్టు, కనీస మద్ధతు ధరల నిర్ణయాలను తన పరిధిలో ఉంచుకున్న కేంద్రంపైనే దేశంలో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణకోసం కేంద్రాన్ని నిలదీస్తూ నిరసన దీక్షలు చేపట్టిన నేతలు.. అనంతరం గవర్నర్ ని కలసి వినతిపత్రం అందించారు. వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ ను నేతలు కోరారు. మ‌హాధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశామని, కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని పరిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు.

First Published:  18 Nov 2021 6:48 AM GMT
Next Story