Telugu Global
NEWS

వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రహదారులు తెగిపోయాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకున్నాయి. అటు ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా వర్షాలతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, […]

వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం..
X

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రహదారులు తెగిపోయాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకున్నాయి. అటు ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా వర్షాలతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున.. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితులకు పునరావాసం, తక్షణ సాయం..
ముంపు ప్రాంతాల బాధితులను వెంటనే పునరావాస శిబిరాల్లోకి తరలించాలని సూచించారు సీఎం జగన్. శిబిరాల్లో వారికి ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు.. తక్షణం వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలని.. అవసరమైన చోట వెంటనే సహాయ శిబిరాలు తెరవాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. గ్రామాల్లో చెరువు గట్లను పరిశీలించాలని, అవసరమైన చోట్ల తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది. పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా విద్యుత్‌ శాఖ అధికారులను సిద్ధం చేస్తోంది.

First Published:  11 Nov 2021 4:55 AM GMT
Next Story