Telugu Global
International

కొనలేనంత, తినలేనంత.. అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఆహారం..

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడుతున్నట్టే కనిపిస్తున్నా.. కొన్ని రంగాలపై కరోనా పరోక్ష ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ముఖ్యంగా ఆహార రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వలస కూలీలు లేక చాలా చోట్ల వ్యవసాయ పనులు తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఆహార ఉత్పత్తులపై పడింది. ఫలితంగా ఆహార పదార్థాల రేట్లు భారీగా పెరిగిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆహార పదార్థాల రేట్లు పైకి ఎగబాకాయని, రోమ్ కి చెందిన […]

కొనలేనంత, తినలేనంత.. అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఆహారం..
X

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడుతున్నట్టే కనిపిస్తున్నా.. కొన్ని రంగాలపై కరోనా పరోక్ష ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ముఖ్యంగా ఆహార రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వలస కూలీలు లేక చాలా చోట్ల వ్యవసాయ పనులు తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఆహార ఉత్పత్తులపై పడింది. ఫలితంగా ఆహార పదార్థాల రేట్లు భారీగా పెరిగిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆహార పదార్థాల రేట్లు పైకి ఎగబాకాయని, రోమ్ కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది. అక్టోబర్ వరకు వరుసగా మూడు నెలల కాలంలోనే దాదాపు 10శాతం రేట్లు పెరిగాయని చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి మరింత పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేసింది.

వలస కార్మికుల కొరతతో తీవ్ర ప్రభావం..
పామాయిల్ కి ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న మలేసియాలో వలస కార్మికుల కొరతతో చాలా వరకు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పామాయిల్ ఎగుమతులు తగ్గిపోయి అంతర్జాతీయంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. కెనడా, రష్యా, అమెరికా, ఇరాన్, టర్కీల్లో గోధుమల దిగుబడి పూర్తిగా పడిపోయింది. పంట ఉత్పత్తిని కొన్ని దేశాలు స్వచ్ఛందంగా తగ్గించి వేశాయి. ఎగుమతులపై దృష్టిపెట్టకుండా దేశీయ అవసరాల మేరకే పండిస్తున్నాయి. దీంతో గోధుమల దిగుమతిపైనే ఆధారపడిన దేశాల్లో వాటి ద్వారా తయారు చేసే ఆహార పదార్థాల రేట్లు చుక్కలనంటుతున్నాయి.

ఆహార సంక్షోభంలో ఇటలీ..
పాస్తా తయారు చేసేందుకు 40శాతం గోధుమలను దిగుమతి చేసుకుంటుంది ఇటలీ. అయితే అంతర్జాతీయంగా గోధుమల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇటలీకి కష్టాలొచ్చాయి. ఇప్పటికే అక్కడ పాస్తా రేట్లు భారీగా పెరిగిపోయాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ టైమ్ కి ఈ రేట్లు మరింతగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది స్థానిక ప్రభుత్వం. చిరుధాన్యాల రేట్లు కూడా నెల రోజుల వ్యవధిలో 3.2 శాతం పెరిగాయని తెలుస్తోంది.

విద్యుత్, రవాణా ఖర్చులు..
పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఆహార ఉత్పత్తుల రేట్లు పెరగడానికి పరోక్షంగా దోహదపడుతున్నాయి. విద్యుత్ చార్జీలు పెరగడం, రవాణా చార్జీలు పెరగడంతో దాని ప్రభావం అంతిమంగా ఆహార రంగంపై పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలు పేద, మధ్యతరగతివారికి ఆర్థిక ఇబ్బందిని తెచ్చిపెట్టాయి.

First Published:  4 Nov 2021 9:11 PM GMT
Next Story