Telugu Global
Cinema & Entertainment

మంచి రోజులు వచ్చాయి మూవీ రివ్యూ

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ , ప్రవీణ్, సత్యం రాజేష్ సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ , రజిత తదితరులు సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాణం : యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత: వి సెల్యూలాయిడ్, SKN కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి రేటింగ్: 2.25/5 దర్శకుడు మారుతికి ఓ అలవాటు ఉంది. కొన్ని సినిమాల్ని ఆయన డైరక్ట్ చేస్తాడు, […]

మంచి రోజులు వచ్చాయి మూవీ రివ్యూ
X

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ , ప్రవీణ్, సత్యం రాజేష్ సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ , రజిత తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాణం : యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్
నిర్మాత: వి సెల్యూలాయిడ్, SKN
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి
రేటింగ్: 2.25/5

దర్శకుడు మారుతికి ఓ అలవాటు ఉంది. కొన్ని సినిమాల్ని ఆయన డైరక్ట్ చేస్తాడు, మరికొన్ని సినిమాల్ని ప్రజెంట్ చేస్తాడు. ఇంకొన్ని సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడు. అలా తన బ్రాండ్ ను కాపాడుకుంటూనే, మరోవైపు తప్పించుకునే ప్రయత్నాలు కూడా చాలానే చేశాడు. అయితే ఈసారి మాత్రం ఈ దర్శకుడు దొరికిపోయాడు. మంచి రోజులు వచ్చాయి సినిమాకు తన పేరు వేసుకోవాలా లేక మరో వ్యక్తి పేరు వేసి తను ప్రజెంట్ చేయాలా అంటూ చాలా తర్జనభర్జన పడ్డాడు మారుతి. చివరికి ప్రాజెక్టుపై నమ్మకంతో తన పేరు వేసుకున్నాడు. అలా కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం మారుతి అనే కార్డుతో వచ్చిన ఈ సినిమా, మారుతికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

గతంలో ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా చేశాడు మారుతి. ఆ సినిమా రిజల్ట్ పై అనుమానంతో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. కానీ అది సూపర్ హిట్టయింది. బహుశా ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, చిన్న బడ్జెట్ లో చిన్న కాన్సెప్ట్ తో తీసిన మంచిరోజులు వచ్చాయి సినిమాకు దర్శకుడిగా తన పేరు వేసుకున్నట్టున్నాడు. కానీ ఫలితం కాస్త తేడా కొట్టింది. గ్రిప్పింగ్ నెరేషన్, బలమైన సన్నివేశాలు లోపించడంతో ఈ మంచి రోజులు వచ్చాయి సినిమా సోసో అనిపించుకుంటుంది.

ఇంతకీ ఈ కథ ఏంటంటే.. హైదరాబాద్ లోని బాలాజీనగర్ కాలనీలో ఉండే గుండు గోపాళం(అజయ్ ఘోష్) ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అది చూసి జలసీగా ఫీలయ్యే పక్కింటి స్నేహితులు కోటి(కోటేశ్వరరావు), మూర్తి (పీడి శ్రీనివాస్) అతని ముఖంపై చిరునవ్వు దూరం చేయాలనుకుంటారు. అందులో భాగంగా కూతురు పద్దు(మెహ్రీన్) ప్రేమ విషయాన్ని గోపాళంకి తెలియజేస్తూ అతన్ని భయపెడుతూ బాధపడేలా చేస్తారు. అలా భయం పెంచుకున్న గోపాళం, తన కూతురు ప్రేమించిన సంతోష్(సంతోష్ శోభన్)ని అల్లుడిగా తిరస్కరిస్తాడు. చివరికి సంతోష్ ఎలా గోపాళం భయాన్ని పోగొట్టాడు, ఎలా పద్దును తనదాన్ని చేసుకున్నాడనేది కథ.

ఇలాంటి సింపుల్ లైన్ కు బలమైన సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే సీన్లు పడాలి. ఫస్టాఫ్ లో అలాంటి కామెడీ, సెకెండాఫ్ లో అలాంటి ఎమోషనల్ సీన్స్ మిస్సయ్యాయి. చెప్పుకోవడానికి సినిమాలో కమెడియన్లంతా ఉన్నారు. కానీ ప్రవీణ్, సుదర్శన్ మాత్రమే నవ్వించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి తేలిపోయారు. మెహ్రీన్ తల్లి పాత్ర పోషించిన రజిత కొన్ని చమక్కులు మెరిపించారు. ఇక కథ మొత్తం తానై మోసిన అజయ్ ఘోష్, తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోగా నటించిన సంతోష్ శోభన్, తన ఈజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. హీరోయిన్ మెహ్రీన్ ఓకే.

కామెడీ పరంగా ప్రవీణ్, సుదర్శన్ ఎలాగైతే ఆకట్టుకున్నారో.. సంగీతం పరంగా అనూప్ రూబెన్స్ అలానే ఆదుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు లేకపోతే సినిమా రిజల్ట్ మరింత ఘోరంగా ఉండేది. అనూప్ అందించిన 2 పాటలు బాగున్నాయి. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడిగా మారుతి సక్సెస్ అయినప్పటికీ.. ఓ కథకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో మారుతి రైటింగ్ గాడి తప్పింది.

మారుతి బలం కామెడీ. ఇతడి సినిమాల నుంచి ఆడియన్స్ ఆశించేది కూడా అదే. గతంలో శైలజారెడ్డి అల్లుడు సినిమా దెబ్బ కొట్టడానికి కారణం కూడా కామెడీ లేకపోవడమే. ఇన్ని అనుభవాలు ఉండి కూడా, ఈ సినిమాలో సరైన కామెడీ రాసుకోలేకపోయాడు మారుతి. కొన్ని మెరుపులు మెరిసినా, చాలా చోట్ల మిస్ ఫైర్ అయింది. దీనికితోడు అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బందిపెట్టాడు మారుతి.

ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం బాగానే చేశాడు. ఆ క్యారెక్టర్స్ కూడా బాగానే రాసుకున్నాడు. ఎప్పుడైతే హీరోహీరోయిన్ల రొమాన్స్ ను తగ్గించి, అజయ్ ఘోష్ పాత్ర నిడివిని పెంచాడో అప్పుడిక సినిమా నీరసంగా తయారైంది. మధ్యమధ్యలో కామెడీతో సినిమాను లేపాలని మారుతి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కాస్త ఓకే అనిపించేలా ఫస్టాఫ్ ను ముగించిన దర్శకుడు, సెకెండాఫ్ లో మాత్రం తన గ్రిప్ ను ప్రదర్శించలేకపోయాడు. తన అనుభవాన్ని రంగరించలేకపోయాడు. అలా అరకొర నవ్వులతో ఈ సినిమా మమ అనిపిస్తుంది. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ను పైపైన తృప్తిపరిచి పంపిస్తుంది.

First Published:  4 Nov 2021 9:55 AM GMT
Next Story