Telugu Global
Family

కరోనా కాలంలో 72శాతం మంది పిల్లల చదువు గోవిందా..

కరోనా కష్టాలు తొలగిపోతున్న దశలో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, హర్యానా.. ఇతర కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో తరగతి గది బోధన మొదలైంది. దేశవ్యాప్తంగా 26కోట్లమంది పిల్లలు తిరిగి స్కూళ్లకు రావడం మొదలు పెట్టారు. ఏడాదిన్నర భారీ గ్యాప్ తర్వాత వీరంతా ఆన్ లైన్ క్లాస్ ల నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారిపై నేషనల్ కొయలేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఓ సర్వే […]

కరోనా కాలంలో 72శాతం మంది పిల్లల చదువు గోవిందా..
X

కరోనా కష్టాలు తొలగిపోతున్న దశలో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, హర్యానా.. ఇతర కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో తరగతి గది బోధన మొదలైంది. దేశవ్యాప్తంగా 26కోట్లమంది పిల్లలు తిరిగి స్కూళ్లకు రావడం మొదలు పెట్టారు. ఏడాదిన్నర భారీ గ్యాప్ తర్వాత వీరంతా ఆన్ లైన్ క్లాస్ ల నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారిపై నేషనల్ కొయలేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వే ప్రకారం దాదాపు 72శాతం మంది ప్రాథమిక స్థాయి విద్యార్థులు కరోనా లాక్ డౌన్ టైమ్ లో అసలు పుస్తకాలే పట్టలేదని, వారి చదువు పూర్తిగా వెనకబడిపోయిందని తేలింది.

ప్రాథమిక స్థాయిలోనే మాతృభాష, గణితంపై పట్టు పెరగాల్సి ఉంటుంది. అలాంటిది లాక్ డౌన్ తో పిల్లలు పూర్తిగా స్కూళ్లకు దూరం అయ్యారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే సీరియస్ గా ఆన్ లైన్ క్లాసులు విని తల్లిదండ్రుల సూచనలతో పాఠాలు చదువుకున్నారు. చాలా చోట్ల 5వ తరగతి లోపు పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోలేదు. స్థోమత ఉన్నా కూడా ఆన్ లైన్ క్లాసులకి డబ్బులు కట్టలేదు. హైస్కూల్ స్టూడెంట్స్ విషయంలో మాత్రమే తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో చిన్న పిల్లలు తిరిగి స్కూల్స్ కి వచ్చి మళ్లీ మొదటినుంచి నేర్చుకోవాల్సి వస్తోంది. అక్షరాలు, నెంబర్లు, ఎక్కాలు, లెక్కలు అన్నీ పూర్తిగా మర్చిపోయారు. హైస్కూల్ విద్యార్థుల్లో కూడా ఈ వెనకబాటు ఉన్నా కూడా. ఆన్ లైన్ క్లాసులు, తల్లిదండ్రుల శ్రద్ధ వల్ల కొంతలో కొంత మేలు.

ప్రాథమిక స్థాయి పిల్లల విషయంలో టీచర్లకు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ముందు బేసిక్స్ నేర్పించాలా లేక కొత్త పాఠాలు చెప్పాలా అనే ఆలోచనలో ఉన్నారు. చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ముందుగా బేసిక్స్ నేర్పించి ఆ తర్వాతే పాఠాల్లోకి వెళ్లాలని టీచర్లకు యాజమాన్యాలు సూచించాయి. ఇక ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. టీచర్లు సిలబస్ పూర్తి చేయడంపై దృష్టిపెడుతున్నారే కానీ, విద్యార్థుల అవగాహన స్థాయిని పట్టించుకోవడంలేదు. దీంతో కరోనా తర్వాత స్కూళ్లకు వస్తున్న ప్రాథమిక స్థాయి విద్యార్థులంతా క్లాస్ రూముల్లో దిక్కుతోచక బిక్కమొహాలేస్తున్నారు.

First Published:  2 Nov 2021 9:18 PM GMT
Next Story