Telugu Global
NEWS

అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటెయ్యండి.. బద్వేలు ప్రజలకు సీఎం జగన్ లేఖ

బద్వేలు ఉప ఎన్నికకు తేదీ దగ్గర పడుతుండటంతో పోటీలో నిలిచిన పార్టీలు ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన ఈ ఎన్నికకు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో కంటే భారీ మెజార్టీ సాధించేందుకుగాను ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బద్వేలులో మకాం వేసి ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా బద్వేలు నియోజకవర్గంలో పర్యటించి భారీ బహిరంగ సభలో నిర్వహిస్తారని […]

అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటెయ్యండి.. బద్వేలు ప్రజలకు సీఎం జగన్ లేఖ
X

బద్వేలు ఉప ఎన్నికకు తేదీ దగ్గర పడుతుండటంతో పోటీలో నిలిచిన పార్టీలు ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన ఈ ఎన్నికకు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో కంటే భారీ మెజార్టీ సాధించేందుకుగాను ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బద్వేలులో మకాం వేసి ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ కూడా బద్వేలు నియోజకవర్గంలో పర్యటించి భారీ బహిరంగ సభలో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే కరోనా నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రచారం నిర్వహించవద్దని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వైసీపీకి ఓటు వేయాలని కోరుతూ బద్వేలు నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధిని చూసి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

‘బద్వేలుకు వచ్చి బహిరంగసభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కమిషన్‌ నిబంధనల నేపథ్యంలో నేను రాలేకపోతున్నా. నేను అక్కడికి వస్తే.. భారీగా ప్రజలు గుమికూడే అవకాశం ఉంది. వారిలో ఏ కొందరికైనా కొవిడ్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని నా పర్యటన రద్దు చేసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నా భావాలను మీతో ప్రత్యక్షంగా పంచుకునేందుకు వీలుగా ఈ ఉత్తరం రాస్తున్నాను’ అంటూ ప్రతీ ఇంటికి సీఎం జగన్ లేఖ రాశారు.

‘ వైఎస్సార్‌ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (డ్వాక్రా) పథకాలు అందాయని తెలిసి సంతోషించాను. ఎన్నికల్లో వాగ్ధానం చేసినవే కాకుండా వాగ్ధానం చేయని కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి సుధను గెలిపించండి’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా ఇవాళ బద్వేలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. గోపవరం మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ బద్వేలులో వైసీపీ గెలుపు పక్కా అని.. మెజారిటీ కోసమే తాము ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2019లో జగనన్న మీద అభిమానంతోనే వెంకటసుబ్బయ్యను 45 వేల మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఈ సారి అంతకు మించిన మెజారిటీతో సుధను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

First Published:  26 Oct 2021 9:42 AM GMT
Next Story