Telugu Global
National

బెంగాల్ లో శరన్నవరాత్రుల బడ్జెట్ రూ. 32,377కోట్లు..

పశ్చిమ బెంగాల్ లో దసరా ఉత్సవాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఊరూవాడా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి, పందిళ్లు వేసి.. నవరాత్రులు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి నిమజ్జనం చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నవరాత్రులకోసం బెంగాలీలు ఖర్చుపెట్టే మొత్తం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా 32,377 కోట్ల రూపాయల వ్యాపారం ఈ పండగ సందర్భంగా బెంగాల్ లో జరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర జీడీపీలో 2.58 శాతానికి […]

బెంగాల్ లో శరన్నవరాత్రుల బడ్జెట్ రూ. 32,377కోట్లు..
X

పశ్చిమ బెంగాల్ లో దసరా ఉత్సవాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఊరూవాడా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి, పందిళ్లు వేసి.. నవరాత్రులు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి నిమజ్జనం చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నవరాత్రులకోసం బెంగాలీలు ఖర్చుపెట్టే మొత్తం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా 32,377 కోట్ల రూపాయల వ్యాపారం ఈ పండగ సందర్భంగా బెంగాల్ లో జరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర జీడీపీలో 2.58 శాతానికి సమానం.

విగ్రహాల తయారీ – 280 కోట్ల రూపాయలు
మండపాల డెకరేషన్, పూలు – 860కోట్లు
లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ – 205 కోట్లు
ప్రచార కార్యక్రమాలు – 504కోట్లు
స్పాన్సర్ షిప్ – 318 కోట్లు
ఇలా లెక్కలు తేల్చారు. ఇవి కాకుండా మిగతా ఖర్చంతా.. ఇతరత్రా కార్యక్రమాలకోసం కేటాయిస్తారు. పండగ సందర్భంగా చేసే షాపింగ్ ది ఇందులో సింహ భాగం. ఏకంగా 27,364 కోట్ల రూపాయల మేర బెంగాలీలు పండగ షాపింగ్ చేస్తారని బ్రిటిషన్ కౌన్సిల్ సర్వే చెబుతోంది. దసరా సందర్భంగా బెంగాల్ లో కొత్త బట్టలు, కొత్త వస్తువులతో ప్రతి ఇల్లూ సందడిగా మారిపోతుంది. ఇక వ్యాపార వర్గాలు కూడా డిస్కౌంట్లతో అందర్నీ ఆకర్షిస్తుంటాయి. పండగ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ హడావిడి కూడా బాగా కనిపిస్తుంది, అమ్మవారి సాహిత్యం, పుస్తకాల అమ్మడం, ఆడియో, వీడియో సీడీల వ్యాపారం.. ఇలా నవరాత్రులు ముగిసే వరకు బెంగాల్ లో వ్యాపారం ఫుల్ జోష్ లో ఉంటుంది. ప్రసాదాలు, అన్నదానాలు, స్వీట్లు, పిండి వంటలు.. ఇలా కేవలం ఆహార పదార్థాలకోసమే బెంగాలీయులు 2,854కోట్లు చేస్తారట. ఇలా అన్నీ ఖర్చులు కలుపుకుంటే బెంగాల్ లో దసరా వ్యాపారం మొత్తం విలువ 32,377కోట్ల రూపాయలుగా తేలుతుంది.

పండగ అంటే పదిరోజులు కాదు..
నవరాత్రి ఉత్సవం అంటే తొమ్మిదిరోజుల పూజ, పదోరోజు నిమజ్జనంతో సరిపోదు. దానికి ఆరేడు నెలల ముందు నుంచీ భారీ కసరత్తు మొదలవుతుంది. అమ్మవారి విగ్రహాల తయారీని అప్పటినుంచే మొదలు పెడతారు. ఆర్డర్లు తీసుకోవడం, సామగ్రి సేకరించడం, కొత్త కొత్త అలంకారాల్లో అమ్మవారి విగ్రహాలను తయారు చేయడం, ట్రాన్స్ పోర్ట్.. ఇదంతా పెద్ద తతంగమే. పండగ అంటే పదిరోజులే కాదని, ఈ పండగ వల్ల ఏడాదంతా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు పశ్చిమబెంగాల్ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి. కేవలం దుర్గామాత విగ్రహాల తయారీ, అలంకరణ, లైటింగ్, డెకరేషన్ ను ఆధారం చేసుకుని కొన్ని లక్షల కుటుంబాలు బెంగాల్ లో జీవనం సాగిస్తాయి. కొవిడ్ ఆంక్షలు లేకపోయి ఉంటే ఈ ఏడాది సందడి మరింతగా పెరిగి ఉండేది. బెంగాల్ వ్యాప్తంగా దుర్గామాత పూజకోసం గుర్తింపు ఉన్న రిజిస్టర్ అయిన ఆధ్యాత్మిక సంఘాలు 36వేలకు పైగానే ఉన్నాయి. కోల్ కతాలోనే 2500 ప్రాంతాల్లో దుర్గామాత పందిళ్లు ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఇలా బెంగాల్ వాణిజ్య విపణితో దసరా పండగకు విడదీయరాని సంబంధం ఉంది.

Next Story