Telugu Global
International

కరువు.. వరదలు.. 2050 నాటికి జల విలయం..

ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాలు 2050 నాటికి తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరించింది. 2018 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 360కోట్ల మంది జలవిలయాన్ని ఎదుర్కొన్నారని, 2050నాటికి ఆ సంఖ్య 500కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కరువు పరిస్థితులతోపాటు, వరదలతో భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశముందని హెచ్చరించింది. ఆసియా, ఆఫ్రికా కీలకం.. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల కాలంలో […]

కరువు.. వరదలు.. 2050 నాటికి జల విలయం..
X

ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాలు 2050 నాటికి తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరించింది. 2018 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 360కోట్ల మంది జలవిలయాన్ని ఎదుర్కొన్నారని, 2050నాటికి ఆ సంఖ్య 500కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కరువు పరిస్థితులతోపాటు, వరదలతో భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశముందని హెచ్చరించింది.

ఆసియా, ఆఫ్రికా కీలకం..
అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల కాలంలో వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. ఏళ్ల తరబడి వర్షాభావ పరిస్థితులతో తిండి గింజలు కరువయ్యే ప్రమాదంలో ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. మరికొన్ని ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. నష్టం మాత్రం తప్పనిసరి, దానికి ఉమ్మడి కారణం కూడా నీరే కావడం ఇక్కడ ప్రధానాంశం. వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పులను ఆపేందుకు మానవ ప్రయత్నం చేయకపోతే మరిన్ని విపరీతాలకు మనం సాక్షులుగా మిగలాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

2019లో జింబాబ్వేలో వరదలకు ప్రాజెక్ట్ ల గేట్లన్నీ ఎత్తేయడంతో కింద ఉన్న మొజాంబిక్ నీట మునగాల్సిన పరిస్థితి. అంటే ఇది ఒక ప్రాంతమో, ఒక దేశానికో సంబంధించింది కాదని, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య అని వివరించింది. వరదల వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల మంది ప్రాణాలు కోల్పోతే.. 7 లక్షల మంది కరువు పరిస్థితులు, తిండి గింజలు లేకపోవడం అనే కారణాలతో మరణిస్తున్నారని తెలిపింది. వాతావరణ మార్పులను ముందుగా అంచనా వేసి కాలుష్యాన్ని నివారిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే 2050నాటికి ప్రపంచం జలవిపత్తుని ఎదుర్కొంటుందని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం.

First Published:  6 Oct 2021 12:30 AM GMT
Next Story