Telugu Global
NEWS

కేసీఆర్ పై ముప్పేట దాడి.. గాంధీ జయంతి నుంచి 'జంగ్ సైరన్'

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి దక్కిన తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ హుషారయ్యే సరికి అటు బీజేపీ కూడా మరింత దూకుడు పెంచింది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్రతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ని విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అలజడి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ […]

కేసీఆర్ పై ముప్పేట దాడి.. గాంధీ జయంతి నుంచి జంగ్ సైరన్
X

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి దక్కిన తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ హుషారయ్యే సరికి అటు బీజేపీ కూడా మరింత దూకుడు పెంచింది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్రతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ని విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అలజడి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బహిరంగ సభలతో పార్టీ మైలేజీ పెరిగిందని అంటున్నారు. ఆ దూకుడు కొనసాగిస్తూ ఇప్పుడు ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ కి రూపకల్పన చేశారు.

తెలంగాణలో ఒక్కో నిరుద్యోగికి సీఎం కేసీఆర్‌ లక్ష రూపాయలు బాకీ పడ్డారని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ శాఖల్లో లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగాలు లేక, ఉపాధి కరవై.. రాష్ట్రంలో యువత ఆత్మహత్యలకు సిద్ధపడుతోందని, దీనికి కేసీఆరే కారణమని పేర్కొన్నారాయన. ఈ అంశాలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరుతో యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు జంగ్ సైరన్ షెడ్యూల్ ప్రకటించారు.

కాంగ్రెస్ డిమాండ్లు..
– నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి..
– ఇంటికో ఉద్యోగం, ఉద్యోగాల భర్తీ హామీల సంగతి తేల్చాలి
– కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలి

కార్యాచరణ..
అక్టోబర్ 2న హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్‌ నుంచి.. కొత్తపేటలోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మండలం, నియోజకవర్గ స్థాయుల్లో కళాశాలలను వేదికగా చేసుకుని సభలు నిర్వహిస్తారు. ప్రతి యూనివర్శిటీలో భారీ సభ ఏర్పాటు చేస్తారు.

హుజూరాబాద్ అభ్యర్థిపై త్వరలో క్లారిటీ
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు రేవంత్‌ రెడ్డి. అభ్యర్థి ఎంపికపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని, ఆ గెలుపే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి కీలక మలుపుగా మారుతుందని అన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  29 Sep 2021 9:58 PM GMT
Next Story