Telugu Global
NEWS

తీరందాటాక కుదిపేసిన గులాబ్.. తెలంగాణ అసెంబ్లీకి 3రోజులు సెలవులు..

గులాబ్ తుపాను తీరం దాటాక తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఏపీలో వర్షాలతోపాటు.. వరదనీటికి ఊరులు, ఏరులు ఏకమయ్యాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, పంటలు దెబ్బతిన్నాయి. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్న తర్వాత ఏపీలోని ఆరు జిల్లాలపై దాని ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఏపీలోని 277 మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ […]

తీరందాటాక కుదిపేసిన గులాబ్.. తెలంగాణ అసెంబ్లీకి 3రోజులు సెలవులు..
X

గులాబ్ తుపాను తీరం దాటాక తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఏపీలో వర్షాలతోపాటు.. వరదనీటికి ఊరులు, ఏరులు ఏకమయ్యాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, పంటలు దెబ్బతిన్నాయి. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్న తర్వాత ఏపీలోని ఆరు జిల్లాలపై దాని ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఏపీలోని 277 మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగి ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా మారాయి. రోడ్లు, వంతెనల మీదుగా వరదనీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అటు విశాఖ విమానాశ్రయంలోకి వరదనీరు చేరడంతో సర్వీసులు రద్దయ్యాయి.

ప్రభుత్వ ఆర్థిక సాయం..
గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావంతో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారమివ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థికసాయం ఇస్తామన్నారు. ఏపీలో గులాబ్ తుపాను విధ్వంసానికి రైతన్నలు కుదేలయ్యారు. మొత్తం 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్టు అంచనా. 6 జిల్లాల రైతులు తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు.

తెలంగాణలో భారీ వర్షాలు..
గులాబ్ ఏపీలో తీరం దాటిన తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో కుంభవృష్టి కురిసింది. నాలాలు పొంగి పొర్లడంతో పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. గ్రేటర్ పరిధిలో 42 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. గులాబ్ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలికి మూడు రోజులు సెలవు ప్రకటించారు. సమావేశాలను అక్టోబర్ 1కి వాయిదా వేశారు.

మొత్తమ్మీద రెండు రాష్ట్రాలను గులాబ్ వణికించింది. ప్రస్తుతం గులాబ్‌ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌ పూర్‌ కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

First Published:  27 Sep 2021 9:21 PM GMT
Next Story