Telugu Global
NEWS

'మైనార్టీబంధు'కి కేసీఆర్ సిద్ధమైనట్టేనా..?

తెలంగాణలో ‘దళితబంధు’ కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికేననేది ప్రతిపక్షాల విమర్శ. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అంచెలంచలుగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని, ఆ తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఇదే రీతిలో ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. దళితులకు మాత్రమే కాదు.. అన్ని కులాలకు కూడా ఇలాగే అండగా ఉంటామని చెప్పారు కేసీఆర్. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు పడేలా కనిపిస్తోంది. అయితే నేరుగా ప్రభుత్వం ప్రకటించకుండా ఎంఐఎంతో ఓ డిమాండ్ […]

మైనార్టీబంధుకి కేసీఆర్ సిద్ధమైనట్టేనా..?
X

తెలంగాణలో ‘దళితబంధు’ కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికేననేది ప్రతిపక్షాల విమర్శ. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అంచెలంచలుగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని, ఆ తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఇదే రీతిలో ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. దళితులకు మాత్రమే కాదు.. అన్ని కులాలకు కూడా ఇలాగే అండగా ఉంటామని చెప్పారు కేసీఆర్. ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు పడేలా కనిపిస్తోంది. అయితే నేరుగా ప్రభుత్వం ప్రకటించకుండా ఎంఐఎంతో ఓ డిమాండ్ ని తరెపైకి తెచ్చేలా చేసింది.

దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణలో ముస్లింలు’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొత్తం 8.8 లక్షల ముస్లిం కుటుంబాలున్నాయని, అందులో 2శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని చెప్పారు ఒవైసీ. వారిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. ఒక శాతం అంటే 8,800మంది ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తే 880 కోట్ల రూపాయలవుతుంది. అంటే తెలంగాణ బడ్జెట్ లో అది 0.8 శాతం కూడా మించదని గణాంకాలతో సహా వివరించారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయాలని సూచించారు.

ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సుధీర్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక సైతం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొందని గుర్తుచేశారు అసదుద్దీన్ ఒవైసీ. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం మించి ముస్లింలు లేరని, భూములు కలిగిన వారు 9 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకం చర్చకు వచ్చినప్పుడు పేద ముస్లిం వర్గాలకు కూడా ఆర్థిక చేయూత అమలు కోసం సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు.

బీజేపీ విమర్శలు..
ఎంఐఎం నేత అసదుద్దీన్ చేసిన డిమాండ్ పై అప్పుడే బీజేపీ విమర్శలు మొదలు పెట్టింది. అసద్ డిమాండ్ వెనక.. కేసీఆర్ ప్రోత్సాహం ఉందని చెబుతున్నారు బీజేపీ నేతలు. దళితబంధు విషయంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు న్యాయం జరగలేదని, ఇక మైనార్టీలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మైనార్టీ బంధు కంటే ముందుగా.. హిందువుల్లోని మిగతా వెనకబడిన వర్గాలందరికీ ఆర్థిక సాయం అందించాలన్నారు. మైనార్టీ బంధు అనేది మరో రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు.

First Published:  27 Sep 2021 9:35 PM GMT
Next Story