Telugu Global
NEWS

తీరం దాటిన గులాబ్.. ఏపీకి తప్పిన తుపాను ముప్పు..

గులాబ్ తుపాను ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగ పట్నం సమీపంలో తీరం దాటింది. దీంతో రెండు రోజులుగా ఉత్తరాంధ్రను వణికించిన తుపాను ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గులాబ్‌ కారణంగా శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కళింగపట్నంలో 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీగలు తెగడంతో […]

తీరం దాటిన గులాబ్.. ఏపీకి తప్పిన తుపాను ముప్పు..
X

గులాబ్ తుపాను ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగ పట్నం సమీపంలో తీరం దాటింది. దీంతో రెండు రోజులుగా ఉత్తరాంధ్రను వణికించిన తుపాను ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గులాబ్‌ కారణంగా శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కళింగపట్నంలో 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి తీగలు తెగడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

భోగాపురంలో అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి తిరిగొస్తుండగా పడవ బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో సూరపతి దానయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వజ్రపుకొత్తూరులో ఆరుగురు మత్స్యకారులు ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా ఈదరుగాలులకు పడవ అదుపుతప్పి సముద్రంలో పడిపోయారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా, మిగిలిన అయిదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 13 తుపాను ప్రభావిత మండలాల్లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,358 మంది నిరాశ్రయులను తరలించి, వారికి భోజనం, ఇతర ఏర్పాట్లు చేశారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు తీర ప్రాంత మండలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని రీ షెడ్యూల్ చేసినట్టు అధికారులు తెలిపారు.

తుపాను పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని రకాలుగా సాయపడుతుందని ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా చూస్తానని, అందరూ క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

First Published:  26 Sep 2021 9:38 PM GMT
Next Story