Telugu Global
NEWS

రేవంత్ పై సీనియర్ల ముప్పేట దాడి..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని రాష్ట్ర సీనియర్ నాయకులు విభేదించిన సంగతి తెలిసిందే. అయితే అవేమీ పట్టని కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ కే పీసీసీ పగ్గాలు అప్పగించింది. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ సీనియర్ల కోపం మాత్రం తగ్గనట్లు ఉంది. సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి పై విమర్శలకు దిగుతూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి పై […]

రేవంత్ పై సీనియర్ల ముప్పేట దాడి..!
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని రాష్ట్ర సీనియర్ నాయకులు విభేదించిన సంగతి తెలిసిందే. అయితే అవేమీ పట్టని కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ కే పీసీసీ పగ్గాలు అప్పగించింది. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ సీనియర్ల కోపం మాత్రం తగ్గనట్లు ఉంది. సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి పై విమర్శలకు దిగుతూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి పై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు.

‘కాంగ్రెస్ లో హీరోయిజం కుదరదు..
ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నా.. పార్టీలో చర్చించక ముందే ప్రోగ్రాములు ఫిక్స్ చేయడమేమిటి.. కాంగ్రెస్ లో అందరూ సమానమే. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదు.సంగారెడ్డికి పీసీసీ వస్తే నాకే సమాచారం ఇవ్వరా.. ఆ మాత్రం ప్రోటోకాల్ తెలియదా’ అని జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అయితే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ వరకు వెళ్లడంతో ఆయన ఆరా తీశారు.

ఏఐసీసీ ఇంచార్జిలు రంగంలోకి దిగి జగ్గారెడ్డిని వెనక్కి తగ్గేలా చేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగానే మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ నాయకత్వం తీరుపై విమర్శలు చేశారు. ‘పీసీసీ నేతలు హుజూరాబాద్ కు ఎందుకు వెళ్లడం లేదు. పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు భారీ ఓటు బ్యాంకు ఉంది. గత మూడు ఎన్నికల్లో 60వేల వరకు ఓట్లు వచ్చాయి. అందరం కలిసి పని చేస్తే మరో 50 వేల ఓట్లు రావా’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గం లో సీనియర్లకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి వారానికి ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా.. అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేని దుబ్బాకలో కూడా 23 వేల ఓట్లు వచ్చాయని.. అలాంటిది పార్టీకి మంచి ఓటుబ్యాంకు హుజూరాబాద్ ను వదిలేస్తే దాని అర్థం ఏమిటని ఆయన మండిపడ్డారు.

హుజూరాబాద్ లో యుద్ధం కంటే ముందే చేతులెత్తేస్తామా.. అని నిలదీశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని పార్టీ సన్నద్ధమయ్యేది ఇలాగేనా అని అన్నారు. ఈ విషయమై వచ్చేవారం రాహుల్, ప్రియాంక గాంధీ ల తో మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల ముందు సీనియర్ నాయకులు రాష్ట్ర పార్టీ పెద్దల తీరుపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. సీనియర్ నాయకులు ముప్పేట దాడిని ఎదుర్కొని రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి.

First Published:  25 Sep 2021 10:18 AM GMT
Next Story