Telugu Global
Health & Life Style

రెండేళ్ల చిన్నారులకూ కోవిడ్ టీకా మొదలైంది..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటి వరకూ వయోజనులకు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ అలాంటి టీకాలు అందుబాటులోకి వచ్చినా ముందుగా 12ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఇస్తారు. అయితే క్యూబా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నాలుగడుగులు ముందుకేసింది. రెండేళ్లు పైబడిన చిన్నారులందరికీ టీకాలు ఇస్తోంది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్.. ఇలా కోవిడ్ టీకాల్లో చాలా రకాలున్నాయి, వీటన్నిటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

రెండేళ్ల చిన్నారులకూ కోవిడ్ టీకా మొదలైంది..
X

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటి వరకూ వయోజనులకు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ అలాంటి టీకాలు అందుబాటులోకి వచ్చినా ముందుగా 12ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఇస్తారు. అయితే క్యూబా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నాలుగడుగులు ముందుకేసింది. రెండేళ్లు పైబడిన చిన్నారులందరికీ టీకాలు ఇస్తోంది.

ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్.. ఇలా కోవిడ్ టీకాల్లో చాలా రకాలున్నాయి, వీటన్నిటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉంది, ప్రపంచంలోని చాలా దేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఇవి కాక, రష్యా, చైనా తమ సొంత తయారీ టీకాలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చాయి. రష్యా టీకా ‘స్పుత్నిక్ -వి’ ను భారత్ లో కూడా వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేకపోయినా, ఇతర దేశాలు సహకరించకపోయినా క్యూబా సొంతంగా రెండు రకాల టీకాలను తయారు చేసుకుంది. ‘సాబరినా’, ‘అబ్దాలా’ అనేవి మేడిన్ క్యూబా టీకాలు. వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేదు, మరే దేశమూ, ఏ కంపెనీ కూడా టీకాల తయారీలో, సాంకేతికత సరఫరాలో క్యూబాకు సాయం చేయలేదు. కానీ దక్షిణ అమెరికాలోనే మొట్టమొదటిగా సొంత వ్యాక్సిన్ తయారు చేసుకున్న దేశంగా క్యూబా గుర్తింపు తెచ్చుకుంది. ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనా, బ్రిటన్, అమెరికా టీకాలపై ఆధారపడుతుంటే, క్యూబా మాత్రం సొంత టీకాలనే వినియోగిస్తోంది. కోటీ పదిలక్షల జనాభా ఉన్న క్యూబాలో 18ఏళ్లుపైబడినవారికి దాదాపుగా 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇప్పుడు రెండేళ్లు పైబడిన చిన్నారులందరికీ టీకాలు ఇస్తున్నారు.

అక్టోబర్ లో స్కూళ్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించడంతో ముందస్తుగా 2 ఏళ్లు పైబడిన చిన్నారులకు టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు వైద్య సిబ్బంది. ఈనెల 6నుంచి వ్యాక్సినేషన్ మొదలు కాగా, ప్రస్తుతానికి దుష్ప్రభావాలేవీ లేవని చెబుతున్నారు. వయోజనులకు వ్యాక్సినేషన్ పూర్తయినా కూడా ఇటీవల క్యూబాలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది, దీంతో పిల్లలకు కూడా టీకా వేయడం మొదలు పెట్టింది ప్రభుత్వం.

ఇతర దేశాల్లో ఇలా..
అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్ ఇటీవలే 12-15 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్‌ టీకాలు ప్రారంభించాయి, అయితే అది కూడా పరిమితంగానే. చైనాలో మూడేళ్ల వయసున్నవారికి కూడా టీకాలు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. చిలీలో ఆరేళ్ల వయసు వారికి టీకాలు ఇవ్వడంపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

భారత్ లో చిన్నారుల టీకా..
భారత్‌ లో 12 ఏళ్లు పైబడి 18ఏళ్ల లోపు వారికి ఇచ్చే టీకాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ముందుగా వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అక్టోబర్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారత్‌లో 18 ఏళ్ల లోపు పిల్లల జనాభా 44 కోట్లు. దేశ జనాభాలో 94 కోట్ల మందికి టీకాలు వేసిన తరవాతే ఆరోగ్యవంతులైన పిల్లలకు టీకాలు వేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. జైడస్‌ క్యాడిలా సంస్థ 12-17 ఏళ్ల వయసున్న పిల్లలపై, భారత్‌ బయోటెక్‌ సంస్థ 2నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుతున్నాయి. జైడస్‌ క్యాడిలా చిన్నారుల టీకా వచ్చే నెలనుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బయొలాజికల్-ఇ సంస్థ తయారు చేసిన కోర్బావ్యాక్స్ టీకా 5-18 ఏళ్ల పిల్లలకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. పెద్దవారికి కొవాక్సిన్ తయారు చేసిన సీరం ఇన్ స్టిట్యూట్, చిన్నారులకోసం కోవా వ్యాక్స్ తయారీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇవన్నీ ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల టీకా విషయంలో క్యూబా మాత్రం ధైర్యంగా ముందడుగేసి, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

First Published:  19 Sep 2021 9:09 PM GMT
Next Story