Telugu Global
National

'అబ్బాజాన్' పై ఆగ్రహ జ్వాలలు.. బీజేపీ వ్యూహం ఫలించినట్టేనా..?

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ.. బీజేపీ మరోసారి హిందూత్వాన్ని బయటకు తీస్తుందని, హిందువుల ఓట్లు గుంపగుత్తగా తమకే పడేలా వ్యూహం రచిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ దఫా రామ మందిర నిర్మాణం బీజేపీకి కలసి వచ్చే అంశం. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇంకాస్త ముందుకెళ్లి ‘అబ్బాజాన్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. రాహుల్ గాంధీ సహా.. సమాజ్ వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్, జేడీయూ నేతలు యోగిపై విమర్శలతో […]

అబ్బాజాన్ పై ఆగ్రహ జ్వాలలు.. బీజేపీ వ్యూహం ఫలించినట్టేనా..?
X

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ.. బీజేపీ మరోసారి హిందూత్వాన్ని బయటకు తీస్తుందని, హిందువుల ఓట్లు గుంపగుత్తగా తమకే పడేలా వ్యూహం రచిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ దఫా రామ మందిర నిర్మాణం బీజేపీకి కలసి వచ్చే అంశం. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇంకాస్త ముందుకెళ్లి ‘అబ్బాజాన్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. రాహుల్ గాంధీ సహా.. సమాజ్ వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్, జేడీయూ నేతలు యోగిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఖుషీనగర్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ‘అబ్బాజాన్‌’ అని మాట్లాడేవారందరూ 2017కి ముందు రేషన్‌ ని బొక్కేశారంటూ ముస్లింలను పరోక్షంగా టార్గెట్‌ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు రేషన్‌ అందుతున్నట్టుగా అప్పట్లో అందలేదని, ఖుషీనగర్‌ లో ఇచ్చే రేషన్ సరకులు నేపాల్, బంగ్లాదేశ్‌ కు తరలిపోయేవని చెప్పారు. ఈ క్రమంలో ‘అబ్బాజాన్‌’ అని మాట్లాడేవారందరూ అంటూ యోగి పరోక్షంగా ముస్లింలను టార్గెట్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ దేశం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, వర్గాలు, కులాలకు చెందినదని.. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని జేడీయూ అధ్యక్షుడు, ఎంపీ లలన్‌ సింగ్‌ యోగికి హితవు చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారు ‘యోగి’ ఎలా అవుతారని, ఆయనకు ఆ పేరెందుకని ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ ప్రతీ ఎన్నికల్లోనూ మతం కార్డునే బయటకు తీస్తోందని, ఈసారి యోగి.. హిందువుల రేషన్‌ ని ముస్లింలు తినేశారని ప్రచారం చేస్తూ తిరిగి సీఎం కుర్చీ ఎక్కడానికి చూస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రేషన్‌ సరిహద్దులు దాటి వెళ్లిందంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. యోగికి చదువు లేకపోవడం వల్లే ఆయన ఇలా అమర్యాదగా మాట్లాడుతున్నారని, నోరు పారేసుకుంటున్నారని, విమర్శించారు ఎస్పీ నేత అశుతోష్‌ సిన్హా.

ఎంఐఎం రంగంలోకి దిగేనా..?
ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం ఓట్లపై బీజేపీ ఎప్పుడూ ఆశలు పెట్టుకోలేదు. అయితే ఆ వర్గంలో చీలిక తెచ్చి ప్రతిపక్షాలు బలపడకుండా చూడటమే బీజేపీ మాస్టర్ ప్లాన్. ఈసారి బీజేపీకి తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ముందస్తు సమాచారంతోనే యూపీలో ఎంపైఎం ఎంట్రీ ఇస్తోందనే వాదన కూడా వినపడుతోంది. బీజేపీ, ఎంఐఎం ఓ ఒప్పందం ప్రకారమే యూపీలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఎంఐఎం ఇంకా ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. యూపీ వ్యతిరేక ముస్లిం ఓటుని ఎంఐఎం గుప్పెట పడితే.. ప్రతిపక్షాలు ఇబ్బంది పడతాయి. ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగించినా, ఎంఐఎంకి లాభం చేకూరిస్తే మాత్రం కచ్చితంగా కమలదళం వ్యూహం ఫలించినట్టే.

First Published:  15 Sep 2021 9:47 PM GMT
Next Story