Telugu Global
International

టీకాలన్నీ మాకే కావాలి.. నాలుగో డోసుకి ఇజ్రాయెల్ రెడీ..

టీకాలు అందుబాటులో లేని పేద దేశాలు సింగిల్ డోస్ కోసం ఇబ్బంది పడుతుంటే, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మాత్రం నాలుగో డోసుకి సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ లో 70లక్షలమంది అర్హులకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆగస్టు నెలలో బూస్టర్‌ డోసు(మూడో డోసు) మొదలు పెట్టారు. మూడో డోసు కూడా 28లక్షల మందికి పైగా చేరింది. దాదాపు 90శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకా తీసుకున్నా అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ […]

టీకాలన్నీ మాకే కావాలి.. నాలుగో డోసుకి ఇజ్రాయెల్ రెడీ..
X

టీకాలు అందుబాటులో లేని పేద దేశాలు సింగిల్ డోస్ కోసం ఇబ్బంది పడుతుంటే, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మాత్రం నాలుగో డోసుకి సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ లో 70లక్షలమంది అర్హులకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆగస్టు నెలలో బూస్టర్‌ డోసు(మూడో డోసు) మొదలు పెట్టారు. మూడో డోసు కూడా 28లక్షల మందికి పైగా చేరింది. దాదాపు 90శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకా తీసుకున్నా అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ నెల మొదటి వారంలో కేసుల సంఖ్య పెరగడంతో ఇజ్రాయెల్ నాలుగో డోసుకి కూడా సిద్ధమవుతోంది. ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉన్న దేశాల జాబితాలో పేరున్న ఇజ్రాయెల్.. వ్యాక్సిన్ల వల్ల ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు కేవలం 6 నెలలు మాత్రమే నిలబడతాయని గట్టిగా నమ్ముతోంది. అందుకే నాలుగో డోసుకి సిద్ధమైనట్టు ప్రకటించారు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నాచ్‌ మన్‌ యాష్‌.

ప్రపంచంలో ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీ మొదలుపెట్టాయి. మరికొన్ని దేశాలు మూడో డోసు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వ్యాక్సిన్‌ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ నాలుగో డోసుకి టీకాలను సమీకరిస్తోంది. మూడో డోసు పంపిణీ పూర్తయ్యేలోగా దేశ ప్రజలందరికీ నాలుగో డోసుకి అవసరమయ్యే సంఖ్యలో టీకాలు నిల్వచేస్తామని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనికోసం ఇప్పటికే ఆయా కంపెనీలకు ఆర్డర్లు పెట్టి టీకాలు తెప్పిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం..
పేద దేశాలు టీకాలు లేక అల్లాడుతుంటే, ధనిక దేశాలు బూస్టర్ డోస్ ల పేరుతో అసమానతలను పెంచి పోషించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). బూస్టర్ డోస్ వినియోగానికి WHO ఏమాత్రం సుముఖంగా లేదు. కేవలం దీర్ఘకాలిక రోగులకు, వృద్ధులకు.. అది కూడా అవసరమైతేనే బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచిస్తోంది. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలను గుప్పెట్లో పెట్టుకున్న సంపన్న దేశాలు, అక్కడి కంపెనీలు పేద దేశాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తామంటే ఊరుకునేది లేదని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే విపత్తువేళ ఇలాంటి ప్రకటనలను ధనిక దేశాలు పట్టించుకోవడంలేదు. టీకాల నిల్వలను అమాంతం పెంచుకుంటున్నాయి.

First Published:  13 Sep 2021 9:16 PM GMT
Next Story