Telugu Global
National

ఆరు నెలల్లో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ..

రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎడా పెడా మార్చేయడం అప్పట్లో కాంగ్రెస్ కి బాగా అలవాటు. రాష్ట్రంలో పార్టీపై పట్టు సాధిస్తున్నారని తెలిసినా, అధిష్టానాన్ని లెక్కపెట్టకపోయినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎం కుర్చీ కిందకు నీరు రావడం ఖాయం. ఇప్పుడు అధికారం లేదు, అవసరమూ లేదు కాబట్టి సరిపోయింది. అయితే ఇప్పుడా ఆనవాయితీని బీజేపీ తీసుకున్నట్టయింది. ఏకంగా ఆరు నెలల వ్యవధిలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. […]

ఆరు నెలల్లో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ..
X

రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎడా పెడా మార్చేయడం అప్పట్లో కాంగ్రెస్ కి బాగా అలవాటు. రాష్ట్రంలో పార్టీపై పట్టు సాధిస్తున్నారని తెలిసినా, అధిష్టానాన్ని లెక్కపెట్టకపోయినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎం కుర్చీ కిందకు నీరు రావడం ఖాయం. ఇప్పుడు అధికారం లేదు, అవసరమూ లేదు కాబట్టి సరిపోయింది. అయితే ఇప్పుడా ఆనవాయితీని బీజేపీ తీసుకున్నట్టయింది. ఏకంగా ఆరు నెలల వ్యవధిలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. నాలుగేళ్ల పాటు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తో ఈ ఏడాది మార్చి 10న రాజీనామా చేయించింది కేంద్రం. ఆ స్థానంలో అదే రోజు తిరత్ సింగ్ రావత్ ని కూర్చోబెట్టింది. అయితే ఆ ముచ్చట ఎన్నోరోజులు లేదు. సరిగ్గా 116 రోజులు సీఎంగా ఉన్న తిరత్ సింగ్ రావత్ జులై 4న రాజీనామా చేసి తప్పుకున్నారు. పుష్కర్ సింగ్ ధామి అదే రోజున కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. ఉత్తరాఖండ్ లో నాలుగు నెలల వ్యవధిలోనే ఇద్దరు సీఎంలను మార్చేసింది బీజేపీ.

కర్నాటకలో యడ్యూరప్ప హవాకు బ్రేక్..
కర్నాటకలో యడ్యూరప్ప బలమైన నేత, వచ్చే ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. కానీ అంతర్గత లుకలుకలు, పార్టీకంటే ఎక్కువగా యడ్డీ బలపడుతున్నారనే ఆరోపణలో ఆయనకు చెక్ పెట్టేసింది అధిష్టానం. వయోభారాన్ని సాకుగా చూపుతూ, అవినీతి ఆరోపణలను తెరపైకి తెస్తూ యడ్డీ రాజకీయ జీవితానికే వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ముందుగా సీఎం కుర్చీనుంచి దింపేసింది. ఏడాదిగా తర్జన భర్జనలు పడిన యడ్డీ, చివరకు విధిలేని పరిస్థితుల్లో జులై 26న సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండ్రోజుల గ్యాప్ లో బసవరాజ్ బొమ్మై సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే అక్కడ అవమాన భారంతో రగిలిపోతున్న యడ్డీ, ఏరోజయినా అసమ్మతి బాంబు పేల్చే ప్రమాదముందని తెలుస్తోంది.

గుజరాత్ కి ఏమైంది..?
తాజాగా గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా ఈ అడుగు వేసినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పాటిల్.. వీరిలో ఎవరో ఒకరు సీఎం అవుతారని తెలుస్తోంది. ఆ మాటకొస్తే.. అంతకు ముందు ఆనందీ బెన్ పటేల్ ని కూడా రెండేళ్లకంటే ఎక్కువగా సీఎం కుర్చీలో ఉండనీయలేదు. ఆ తర్వాత వచ్చిన విజయ్ రూపానీని కూడా, అసెంబ్లీ ఎన్నికల పేరు చెప్పి అనూహ్యంగా తప్పించారు.

యోగీ అదృష్టవంతుడేనా..?
ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎం కుర్చీకి దూరమవుతారనే ప్రచారం జోరుగా సాగింది. యోగీ వరుస ఢిల్లీ పర్యటనలతో ఆ వివాదం సద్దుమణిగింది. కేవలం రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయడానికి మాత్రమే యోగీ సమ్మతించారని, సీఎంగా దిగిపోవడానికి ఇష్టపడలేదని, అధిష్టానానికే ఎదురు తిరిగారని సమాచారం. ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్న యోగీ వ్యవహారంలో అంతకు మించి ముందుకెళ్లడానికి మోదీ-అమిత్ షా కూడా ధైర్యం చేయలేదు. దీంతో ఆ లిస్ట్ నుంచి యోగీ తప్పించుకున్నారు. మొత్తమ్మీద ఆరు నెలల వ్యవధిలో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ, సరికొత్త సంప్రదాయానికి తెరతీసినట్టయింది.

Next Story