Telugu Global
NEWS

మైనింగ్ శాఖ అధికారి బదిలీ కలకలం..

మైనింగ్ శాఖలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆర్.ప్రతాపరెడ్డి బదిలీ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. నిజాయితీగల అధికారిగా పేరున్న ప్రతాపరెడ్డిని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల విధులనుంచి తప్పించి నామ మాత్రంగా గనులు ఉన్న విజయనగరం జిల్లాకు పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీని వెనక చాలా వ్యవహారం నడిచిందని, ఆయన నిజాయితీ వల్ల ఇబ్బంది పడిన మైనింగ్ మాఫియా ప్రతాపరెడ్డిపై బదిలీ వేటు వేయించిందని సమాచారం. టీడీపీ హయాంలో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా.. […]

మైనింగ్ శాఖ అధికారి బదిలీ కలకలం..
X

మైనింగ్ శాఖలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆర్.ప్రతాపరెడ్డి బదిలీ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. నిజాయితీగల అధికారిగా పేరున్న ప్రతాపరెడ్డిని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల విధులనుంచి తప్పించి నామ మాత్రంగా గనులు ఉన్న విజయనగరం జిల్లాకు పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీని వెనక చాలా వ్యవహారం నడిచిందని, ఆయన నిజాయితీ వల్ల ఇబ్బంది పడిన మైనింగ్ మాఫియా ప్రతాపరెడ్డిపై బదిలీ వేటు వేయించిందని సమాచారం.

టీడీపీ హయాంలో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా..
టీడీపీ హయాంలో భూగర్భ, గనుల శాఖలో విజిలెన్స్ విభాగం ఈడీగా ఉన్నారు ప్రతాపరెడ్డి . అనంతపురం జిల్లాలో విధులు నిర్వహించే సందర్భంలో ఆయన టీడీపీ నేతలకు సైతం ఎదురెళ్లారు. అధికార పార్టీ నేతలు చెప్పినా వినకుండా నిజాయితీగా వ్యవహరించారు. జేసీ సోదరులకు, వారి అనుచరులకు సంబంధించి గ్రానైట్ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపారు. భారీ మొత్తంలో జరిమానాలు విధించడమే కాదు, ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ప్రతాపరెడ్డికి ముందు ఏడాదికి కేవలం కోటి రూపాయలు వసూలయ్యే జరిమానా, ఆయన హయాంలో రెండేళ్లలో పదికోట్ల రూపాయలు దాటింది. తమకు కొరకరానికొయ్యలా మారిన ప్రతాపరెడ్డిని అడ్డు తప్పించుకునేందుకు సైతం మైనింగ్ మాఫియా ప్రయత్నించింది. భౌతిక దాడులకు ఆయన బెదరలేదు, అవినీతి మరక అంటించే ప్రయత్నం జరిగినా.. డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీలో మచ్చలేని మనిషిగా బయటపడ్డారు. దీంతో టీడీపీ నేతలు ఆయన్ను ఏమీ చేయలేక వదిలిపెట్టారు.

ఇప్పుడు వైసీపీ హయాంలో దాదాపు ఏడాదిన్నర క్రితం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విజిలెన్స్ ఈడీగా బాధ్యతలు చేపట్టారు ప్రతాపరెడ్డి. అక్కడ కూడా మైనింగ్ మాఫియాను ఆయన హడలెత్తించారు. నవయుగ, మధుకాన్, నవోదయ గ్రానైట్స్ వంటి పేరున్న కంపెనీలపై దాడులు చేశారు. భారీ మొత్తంలో జరిమానాలు విధించి వసూలు చేశారు. అయితే ఈసారి మైనింగ్ మాఫియా పాచిక పారింది. ప్రతాపరెడ్డిపై బదిలీ వేటు పడింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలను ఆయన పరిధినుంచి తప్పిస్తూ, కేవలం విజయనగరం జిల్లాకే ఆయన్ను పరిమితం చేశారు ఉన్నతాధికారులు. మైనింగ్ మాఫియా ఒత్తిడితోనే ఇదంతా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజాయితీగల అధికారిపై వేటు పడటంతో కలకలం రేగింది.

First Published:  10 Sep 2021 3:57 AM GMT
Next Story