Telugu Global
International

టీచర్ల డ్రస్సింగ్ పై ఆంక్షలు.. జీన్స్, లెగ్గిన్స్ వద్దు..

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రభావం పాకిస్తాన్ పై కూడా పడింది. అసలు పాకిస్తాన్ అండ చూసుకునే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో తాలిబన్ల తరహాలోనే పాకిస్తాన్ లో కూడా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పాకిస్తాన్‌ ఫెడరల్‌ డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌డీఈ) ఈ ఆంక్షలను పాటించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై పాకిస్తాన్ లో ఉపాధ్యాయులంతా సదరు నియమావళికి అనుగుణంగా నడచుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని […]

టీచర్ల డ్రస్సింగ్ పై ఆంక్షలు.. జీన్స్, లెగ్గిన్స్ వద్దు..
X

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రభావం పాకిస్తాన్ పై కూడా పడింది. అసలు పాకిస్తాన్ అండ చూసుకునే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో తాలిబన్ల తరహాలోనే పాకిస్తాన్ లో కూడా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పాకిస్తాన్‌ ఫెడరల్‌ డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌డీఈ) ఈ ఆంక్షలను పాటించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై పాకిస్తాన్ లో ఉపాధ్యాయులంతా సదరు నియమావళికి అనుగుణంగా నడచుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

లేడీ టీచర్ల వస్త్రధారణపై పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ వేసుకుని స్కూల్స్, కాలేజీలకు రాకూడదని, టైట్ గా ఉండే లెగ్గిన్స్ తరహా దుస్తులు కూడా ధరించొద్దని ఆదేశాలిచ్చింది. పురుష ఉపాధ్యాయులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే పురుషులు జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదు. పాకిస్తాన్ లోని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థల్లో ఈ నియమాలు అమలు చేయాల్సిందే. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ వీటికి కట్టుబడి ఉండాల్సిందే. పాకిస్తాన్‌ ఫెడరల్‌ డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన ఈ నియమావళిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

తాలిబన్లకంటే ఎక్కువగా..
ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన తాలిబన్లు మహిళల హక్కులను గౌరవిస్తామని చెబుతూనే అక్కడ పలు ఆంక్షలు అమలులో పెట్టారు. కో ఎడ్యుకేషన్ నిషేధించారు. తప్పనిసరి అయితే స్టూడెంట్స్ మధ్య పరదా పెట్టాలనే నియమాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు చదువుకుంటే గొప్పవారు కాలేరని, తాలిబన్లలో ఎవరూ హైస్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదని, కానీ తామంతా దేశానికి నాయకులం అయ్యామని సాక్షాత్తూ తాలిబన్ విద్యాశాఖా మంత్రే విద్యార్థులకు సందేశమిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో పాకిస్తాన్ లో కూడా కొత్త రూల్స్ పెట్టడం వివాదాలకు తావిస్తోంది. అయితే ముందుగా విద్యార్థులపై కాకుండా.. టీచర్లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం విశేషం.

First Published:  9 Sep 2021 9:49 PM GMT
Next Story