Telugu Global
NEWS

గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. మోదీ-కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు..

తెలంగాణలో ఉప్పు-నిప్పుగా కనిపించే బీజేపీ, టీఆర్ఎస్.. ఢిల్లీకి వెళ్లే సరికి పాలు, నీళ్లలా కలసిపోతాయని.. మోదీ, కేసీఆర్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, అయితే అది కాలనుగుణంగా బయటపడుతూ ఉంటుందని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ పీసీసీ కమిటీ ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంగా.. ఆయన కేసీఆర్ హస్తిన టూర్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆస్తులు పెంచుకోడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన […]

గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. మోదీ-కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు..
X

తెలంగాణలో ఉప్పు-నిప్పుగా కనిపించే బీజేపీ, టీఆర్ఎస్.. ఢిల్లీకి వెళ్లే సరికి పాలు, నీళ్లలా కలసిపోతాయని.. మోదీ, కేసీఆర్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, అయితే అది కాలనుగుణంగా బయటపడుతూ ఉంటుందని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ పీసీసీ కమిటీ ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంగా.. ఆయన కేసీఆర్ హస్తిన టూర్ పై విమర్శలు ఎక్కు పెట్టారు.

ఆస్తులు పెంచుకోడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన..
వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్, పునర్ విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ పొందలేదని అన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి శంకుస్థాపన చేసుకోవడం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ఎలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా హైదరాబాద్‌లో అమరవీరుల స్తూపాన్ని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన స్థలంలో అమరుల స్థూపం కట్టి ఉంటే అది నిజంగానే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయ్యేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటున్న కేసీఆర్, ఇప్పుడు మోదీ చలవతో ఢిల్లీలో కూడా కట్టుకుంటున్నారని, ఇవన్నీ కేసీఆర్ కుటుంబ ఆస్తులు కానీ, వీటితో తెలంగాణ సమాజానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ కంటే ముందే టీఆర్ఎస్ భవన్ కి శంకుస్థాపన జరగడం వెనక మతలబేంటో ప్రజలకు తెలుసన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాదని, ఆత్మద్రోహానికి ప్రతీక అని అన్నారు.

ఎన్నికలంటే ఎందుకంత భయం..?
హుజూరాబాద్ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బార్లు తెరవడానికి రాని అడ్డంకి, పోలింగ్ కి ఎందుకు వస్తోందని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్ ఏది చెబితే, కేంద్రం దానికి తలూపుతోందని, మోదీ-కేసీఆర్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధానికి ఇదే నిదర్శనం అని అన్నారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఈ బంధాన్ని విడదీయలేరని చెప్పారు. సంజయ్ వేలు విరిగినా, ఈటల మోకాలి చిప్పలు అరిగినా ఎవ్వరూ కనికరించేవారు లేరని ఎద్దేవా చేశారు.

రాజకీయంగా కేసీఆర్‌ అండగా నిలబడుతున్నందుకే మోదీ ఆయనకు ఆస్తులు రాసిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనం వల్ల రాష్ట్ర ప్రజలకు అణాపైసా లాభం ఉండదని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లను చీల్చడానికి అక్కడ ఎంఐఎంని ఎన్నిచోట్ల పోటీ చేయించాలనే విషయంపై మోదీ, అమిత్‌ షా తో కేసీఆర్‌ చర్చించారని, ఆయన పర్యటనకు అసలు కారణం అదేనని విమర్శించారు.

First Published:  8 Sep 2021 9:54 PM GMT
Next Story