Telugu Global
NEWS

పాత ప్రాజెక్ట్ లకు మళ్లీ అనుమతులెందుకు..? నీటి వాటాలపై కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, వాటికి న్యాయమైన నీటి కేటాయింపులు ఉన్నాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కి వివరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం ఇటీవల జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను అనుమతుల్లేని జాబితాలో చేర్చారని.. వాటిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ 11 ప్రాజెక్ట్ లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం చేపట్టినవేనని అన్నారు. అవన్నీ రాష్ట్రానికి కేటాయించిన […]

పాత ప్రాజెక్ట్ లకు మళ్లీ అనుమతులెందుకు..? నీటి వాటాలపై కేసీఆర్..
X

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నిటికీ గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, వాటికి న్యాయమైన నీటి కేటాయింపులు ఉన్నాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కి వివరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం ఇటీవల జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను అనుమతుల్లేని జాబితాలో చేర్చారని.. వాటిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ 11 ప్రాజెక్ట్ లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం చేపట్టినవేనని అన్నారు. అవన్నీ రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల పరిధిలోకే వస్తాయని వివరించారు.

కృష్ణా ట్రైబ్యునల్ కొత్తగా ఏర్పాటు చేయాలి..
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానది నీటి పంపిణీ కోసం అంతర్ రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరారు సీఎం కేసీఆర్. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం సూచన మేరకు కృష్ణా ట్రైబ్యునల్‌ పై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89లో నీటి పంపకాలకు పరిమిత అవకాశాలే ఉన్నాయని, ఆ సెక్షన్‌ ప్రకారం ట్రైబ్యునల్‌ ప్రతిపాదిస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు కేసీఆర్. అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ట్రైబ్యునల్ విధివిధానాలను ఖరారు చేయాలని కోరారు.

ఏపీపై ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. కృష్ణా బేసిన్ బయటకు నదిలోని నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బేసిన్‌ లోని ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఏపీకి సూచించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ను విద్యుత్‌ ఉత్పత్తి కోసమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జారీచేసిన కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ల అపాయింటెడ్ డే ని అక్టోబర్ 14 నుంచి కాకుండా.. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఆ రెండు బోర్డులకు తాము సహకరిస్తామని చెప్పారు.

First Published:  6 Sep 2021 10:26 PM GMT
Next Story